రెండు వారాల్లో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనున్న టీమ్ఇండియా ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొననుంది. జులై 12 నుంచి ఆగస్టు 13 మధ్య జరిగే విండీస్ పర్యటనలో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి ఆసియా కప్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే, ఆసియా కప్ కోసం భారత జట్టును సెలెక్షన్ కమిటీ ఇంకా ప్రకటించలేదు. విండీస్‌తో వన్డే టూర్ ముగిసిన తర్వాత ఈ జట్టు ప్రకటన రానుంది. లేదంటే కీలక ఆటగాళ్లైన బుమ్రా, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకుంటే.. వారితో కలిపి జట్టును ప్రకటించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఆసియా కప్ ఆడే భారత జట్టే దాదాపుగా వన్డే ప్రపంచకప్‌లో ఆడే ఛాన్స్‌లు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ కోసం ఎలాంటి జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఓపెనర్లుగా వారే..
వన్డేలో టీమ్ఇండియా ఓపెనర్ల విషయంలో సమస్యే లేదు. సారథి రోహిత్ శర్మతో పాటు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపు ఖాయమే. ఇటీవలి కాలంలో టెస్టు, వన్డే, టీ20లలో శుభ్‌మన్ గిల్ సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్లో అతడే టాప్ స్కోరర్. దీంతో ఓపెనర్‌గా రోహిత్‌కు అతడే సరిజోడి. ఇక రిజర్వ్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉంటాడు. మరో ఆటగాడు యశస్వీ జైస్వాల్ కూడా ఓపెనింగ్ స్థానంపైనే కన్నేస్తున్నాడు.
మిడిల్ పటిష్ఠం!
భారత జట్టులో మిడిలాడర్ ఆటగాళ్ల కొదవ లేదు. నిలబడితే భారీ స్కోరు చేసే స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ.. జట్టుకు అత్యంత కీలకం కానున్నాడు. అతడు ఫామ్‌లో ఉండటం టీమ్ఇండియాకు పెద్ద సానుకూలాంశం. ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చడం కోహ్లీకి కొట్టిన పిండి. ఇక నాలుగో స్థానానికి కేఎల్ రాహుల్ గట్టి పోటీ ఇవ్వనున్నాడు. ఫిట్నెస్ సాధించి తుది జట్టులో చేరితే అతడు నాలుగో స్థానంలో ఆడటం ఖాయమే. గత మ్యాచ్‌లలో టీమ్ఇండియాకు అతడే కీపింగ్ చేస్తుండటం గమనార్హం.
ఇక ఐదో స్థానంలో ఆడే ఆటగాడి కోసం సెలెక్టర్లు గట్టిగా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరినైనా ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో గందరగోళం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అవసరమనిపిస్తే వన్డేలో ఇప్పటికే ద్విశతకం సాధించిన ఇషాన్ కిషన్‌ను తీసుకోవచ్చు. సంజూకు అవకాశాలు ఇచ్చే ఛాన్సూ కొట్టిపారేయలేం. ఇక ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్య టీమ్‌కు కీలకం అవుతాడు. స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాకు ఛాన్స్ ఉంటుంది. అతడు లేని పరిస్థితుల్లో అక్షర్ పటేల్‌ను ఆడించొచ్చు.
స్పిన్నర్ల పాత్ర..
జట్టులో జడేజా, అక్షర్ పటేల్ వీరిద్దరూ ఉన్నారంటే భరోసా ఉంటుంది. జట్టుకు అవసరమైనప్పుడు ఈ ఇద్దరూ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తారు. కానీ మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండాలి అనుకుంటే.. కుల్‌దీప్ / చాహల్ వీరిలో ఎవరైనా ఒక్కరికే ఛాన్స్ లభిస్తుంది. ఇద్దరూ జట్టులో ఉండాలి అనుకుంటే జడేజా, అక్షర్లలో ఒకరిని వదులుకోవాల్సిందే.
పేసర్లు వీళ్లేనా..?
ఆసియా కప్‌లో శ్రీలంక వేదికగానే భారత్ తమ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. లంక పిచ్‌లపై ఆడేందుకు.. భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగినా గట్టెక్కెయ్యవచ్చు. అయితే ఆల్‌రౌండర్‌గా పాండ్య జట్టులో ఖాయం. బుమ్రా పూర్తి ఫిట్నెస్తో వస్తే.. అతడి స్థానానికి డౌటే లేదు. ఇక ఇంకో స్థానం కోసం సిరాజ్- షమీల మధ్య పోటీ ఉండనుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్రాన్, అర్ష్దీప్సింగ్లు ఉన్నాగాని వాళ్లకు అవకాశం వస్తుందని చెప్పలేము. కానీ విండీస్‌తో టీ20 సిరీస్‌లో తుది జట్టులో ఉండొచ్చు.
ఆసియా కప్ కోసం తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్, బుమ్రా, షమీ/సిరాజ్