India Vs Pakisthan Match: పరుగుల వరద పారలేదు.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురవలేదు.. మ్యాచ్‌లో చాలావరకు పెద్దగా మలుపులు కూడా ఏమీ లేవు..!
కొన్ని పరుగులొస్తున్నాయి.. అప్పుడప్పుడూ వికెట్లూ పడుతున్నాయి.. రెండు జట్లూ జాగ్రత్తగా, రక్షణాత్మకంగా ఆడుతూ మ్యాచ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
బ్యాటింగ్‌లో మెరుపుల్లేక మజా లేదని.. మలుపుల్లేక ఉత్కంఠ కనిపించడం లేదని.. అభిమానుల్లో ఒకింత నిరాశ! ఇది కాదు కదా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అన్న నిట్టూర్పు!
కానీ మ్యాచ్ చివరి అంకంలోకి వచ్చేసరికి బోలెడంత ఉత్కంఠ. ఉన్న బంతులు తక్కువ.. చేయాల్సిన పరుగులు ఎక్కువ! గెలిపిస్తాడనుకున్న సూర్యకుమార్ పెవిలియన్ చేరిపోయాడు. జడేజా బాగానే ఆడుతున్నా అతడి వేగం సరిపోవడం లేదు. అప్పుడొచ్చాడు హార్దిక్ పాండ్య!
బౌలింగ్‌లో పాక్‌ను దెబ్బ కొట్టిన అతడే.. బ్యాటింగ్‌లోనూ సమయోచితంగా చెలరేగాడు. జడ్డూ అండతో మెరుపు షాట్లు ఆడి జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. అయినా సరే ఆఖర్లో ఉత్కంఠ తప్పలేదు. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సిన స్థితిలో తొలి మూడు బంతుల్లో వికెట్ కోల్పోయి, చేసిన పరుగు ఒక్కటే. 3 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో ఏం జరుగుతుందా అని అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు కొట్టాడు హార్దిక్ ఒక బలమైన షాట్.. లాంగాన్ దిశగా గాల్లో లేచిన బంతి రాకెట్ వేగంతో దూసుకెళ్లి స్టాండ్స్‌లో పడింది. అంతే.. భారత అభిమానుల సంబరం అంబరాన్నంటింది.
ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. హార్దిక్ పాండ్య (3/25), భువనేశ్వర్ (4/26) విజృంభించడంతో మొదట పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. రిజ్వాన్ (43; 42 బంతుల్లో 4×4, 1×6) టాప్ స్కోరర్. జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6), హార్దిక్ పాండ్య (33 నాటౌట్; 17 బంతుల్లో 4×4, 1×6)ల అద్భుత భాగస్వామ్యంతో లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (35; 34 బంతుల్లో 3×4, 1×6) రాణించాడు.
ఒత్తిడిలో.. వాళ్లిద్దరూ..: హర్థిక్, జడేజా సూపర్ భాగస్వామ్యంతో లక్ష్యాన్ని అందుకున్నా ఛేదనలో భారత్‌కు తడబాటు తప్పలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది. అరంగేట్ర బౌలర్ నసీమ్ షా బౌలింగ్‌లో రాహుల్ (0) బౌల్డయ్యాడు. కానీ రోహిత్, కోహ్లి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే కోహ్లి మొదట్లో తడబడ్డాడు. ఖాతా అయినా తెరవకముందే ఫకార్ జమాన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి.. క్రీజులో కాస్త ఇబ్బందిగానే కదిలాడు. అయితే దహాని బౌలింగ్‌లో మిడ్‌వికెట్లో బౌండరీతో కాస్త ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాడు. కానీ మరోసారి అతడికి కలిసొచ్చింది. రవూఫ్ బౌలింగ్‌లో టాప్ ఎడ్జ్ కీపర్ తలమీదుగా సిక్స్‌కు వెళ్లింది. రోహిత్‌కు ఎక్కువగా బంతులాడే అవకాశం రాలేదు. కానీ ఎనిమిదో ఓవర్లో నవాజ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడు. భారత్ 50/1తో సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లనిపించింది. కానీ అదే ఓవర్లో రోహిత్ (12) ఔట్ కావడం, పదో ఓవర్లో కోహ్లి నిష్క్రమించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 53/3కు పడ్డ భారత్‌ను సూర్యకుమార్ (18; 18 బంతుల్లో 1×4), జడేజా నడిపించారు. స్కోరు వేగంగా రాకున్నా, పెద్ద షాట్లు కరవైనా, సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతున్నా.. భారత్ నియంత్రణలోనే ఉన్నట్లనిపించింది. 14 ఓవర్లకు స్కోరు 89/3. కానీ ఆ కీలక సమయంలో నసీమ్ బౌలింగ్‌లో సూర్య ఔట్ కావడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే జడేజా చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అతడికి తోడు హార్దిక్ కూడా నిలిచాడు. భారత్ క్రమంగా లక్ష్యం వైపు సాగింది. ఉత్కంఠను అధిగమిస్తూ విజయతీరాలకు చేరింది. హార్దిక్, జడేజా జంట అయిదో వికెట్‌కు 52 పరుగులు జోడించింది.
ఉత్కంఠ ఉత్కంఠ..: హార్దిక్, జడేజా క్రీజులో ఉన్నా.. భారత్ చివరి మూడు ఓవర్లలో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌లో ఉత్కంఠ రేగింది. కండరాలు పట్టేసినప్పటికీ పట్టుదలగా బౌలింగ్ చేసిన నసీమ్ షా బౌలింగ్‌లో జడేజా ఓ ఫోర్, సిక్స్ కొట్టాడు. 19వ ఓవర్లో (రవూఫ్) హార్దిక్ మూడు ఫోర్లు కొట్టడంతో భారత్ సమీకరణం తేలిగ్గా మారింది. చివరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సిన పరిస్థితి. పైగా బౌలర్ స్పిన్నర్ నవాజ్. కానీ కథ అంత తేలిగ్గా ముగియలేదు. తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి జడేజా బౌల్డ్ కావడం, తర్వాతి రెండు బంతుల్లో ఒక్క పరుగే రావడంతో ఉత్కంఠ తీవ్రమైంది. కానీ నాలుగో బంతికి లాంగాన్‌లో సిక్స్ కొట్టిన హార్దిక్.. పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు.
పాక్‌కు హార్దిక్ దెబ్బ: అంతకుముందు టీమ్‌ఇండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాకిస్థాన్‌కు కళ్లెం వేసింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌గా తన విలువను మరోసారి చాటుకుంటూ హార్దిక్ పాండ్య అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కచ్చితమైన షార్ట్ పిచ్ బంతులతో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి మెరుగైన స్కోరు ఆశలకు చెక్ పెట్టాడు. చక్కగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కూడా పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. 5 ఓవర్లలో 30/1తో నిలిచింది. భువి పొదుపుగా బౌలింగ్ చేయడమే కాదు.. ప్రమాదకర బాబర్ అజామ్ (10)నూ ఔట్ చేశాడు. బౌలింగ్ దాడిని ఆరంభించిన భువి.. మూడో ఓవర్లో ఓ షార్ట్ బంతితో బాబర్‌ను బోల్తా కొట్టించాడు. స్క్వేర్ లెగ్‌లో బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన బాబర్.. టాప్ ఎడ్జ్‌తో అర్ష్‌దీప్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. భువితో పాటు అర్ష్‌దీప్ కూడా బ్యాట్స్‌మెన్‌కు స్వేచ్ఛనివ్వలేదు. కానీ కాస్త పుంజుకుని 10 ఓవర్లయ్యేసరికి 68/2 నిలిచింది పాకిస్థాన్. మరో వికెట్ పోయినా ఆ జట్టు కాస్త మెరుగ్గానే కనిపించింది. కారణం మహ్మద్ రిజ్వాన్. తొలి 17 బంతుల్లో 9 పరుగులే చేసిన అతడు.. కాస్త వేగం పెంచాడు. ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అవేష్‌కు వరుసగా 6, 4తో స్వాగతం పలికాడు. అదే ఓవర్లో ఫకార్ జమాన్ (10) ఔటైనా.. ఇఫ్తికార్ (28; 22 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి రిజ్వాన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 12 ఓవర్లకు స్కోరు 87/2. కానీ పాక్‌కు భారత్ పైచేయి సాధించే అవకాశమివ్వలేదు. బౌలర్లు పుంజుకున్నారు. నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్ ఇద్దరినీ ఔట్ చేయడం ద్వారా పాక్‌ను హార్దిక్ గట్టి దెబ్బతీశాడు. మొదట ఇఫ్తికార్‌ను ఔట్ చేసిన హార్దిక్.. బలపడుతున్న మూడో వికెట్ భాగస్వామ్యాన్ని (45) విడదీశాడు. 13వ ఓవర్లో 142 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బౌన్సర్‌ను హుక్ చేయబోయిన ఇఫ్తికార్ వికెట్‌కీపర్ కార్తీక్‌కు చిక్కాడు. హార్దిక్ తన తర్వాతి ఓవర్లో రిజ్వాన్‌నూ బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. అదే ఓవర్లో ఖుష్‌దిల్‌షా (2)ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత పతనం వేగంగా సాగింది. నిజానికి 147 పరుగులే చేసినా.. పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తీరు పట్ల కాస్త సంతృప్తి చెందే ఉంటుంది. 19వ ఓవర్లో ఆ జట్టు 128/9తో నిలవగా.. ఆఖర్లో షెహనవాజ్ దహాని (16; 6 బంతుల్లో 2×6), హారిస్ రవూఫ్ (13 నాటౌట్; 7 బంతుల్లో 2×4) బ్యాట్లు ఝుళిపించారు.
పాకిస్థాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) అవేష్ (బి) హార్దిక్ 43; బాబర్ అజామ్ (సి) అర్ష్‌దీప్ (బి) భువనేశ్వర్ 10; ఫకార్ జమాన్ (సి) కార్తీక్ (బి) అవేష్ 10; ఇఫ్తికార్ (సి) కార్తీక్ (బి) హార్దిక్ 28; ఖుష్‌దిల్‌షా (సి) జడేజా (బి) హార్దిక్ 2; షాదాబ్ ఖాన్ ఎల్బీ (బి) భువనేశ్వర్ 10; అసిఫ్ అలీ (సి) సూర్య (బి) భువనేశ్వర్ 9; నవాజ్ (సి) కార్తీక్ (బి) అర్ష్‌దీప్ 1; రవూఫ్ నాటౌట్ 13; నసీమ్ షా ఎల్బీ (బి) భువనేశ్వర్ 0; దహాని (బి) అర్ష్‌దీప్ 16; ఎక్స్‌ట్రాలు 5
మొత్తం: (19.5 ఓవర్లలో ఆలౌట్) 147;
వికెట్ల పతనం: 1-15, 2-42, 3-87, 4-96, 5-97, 6-112, 7-114, 8-128, 9-128;
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-26-4; అర్ష్‌దీప్ 3.5-0-33-2; హార్దిక్ 4-0-25-3; అవేష్ 2-0-19-1; చాహల్ 4-0-32-0; జడేజా 2-0-11-0
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఇఫ్తికార్ (బి) నవాజ్ 12; రాహుల్ (బి) నసీమ్ 0; కోహ్లి (సి) ఇఫ్తికార్ (బి) నవాజ్ 35; జడేజా (బి) నవాజ్ 35; సూర్యకుమార్ (బి) నసీమ్ 18; హార్దిక్ పాండ్య నాటౌట్ 33; దినేశ్ కార్తీక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14
మొత్తం: (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 148;
వికెట్ల పతనం: 1-1, 2-50, 3-53, 4-89, 5-141;
బౌలింగ్: నసీమ్ 4-0-27-2; దహాని 4-0-29-0; రవూఫ్ 4-0-35-0; షాదాబ్ 4-0-19-0; నవాజ్ 3.4-0-33-3
- 4/26.. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ బౌలింగ్ ప్రదర్శన ఇది. పాకిస్థాన్‌పై టీ20ల్లో ఓ భారత బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు ఇవే.
- 2.. రాస్ టేలర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ వంద చొప్పున మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లి రికార్డులకెక్కాడు. పాక్‌తో ఆదివారం ఆడింది అతడి వందో టీ20. విరాట్ టెస్టుల్లో 102, వన్డేల్లో 262 మ్యాచ్‌లు ఆడాడు.
- పదికి పది పేసర్లకే.. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో భారత్ పడగొట్టిన పది వికెట్లూ పేసర్ల ఖాతాలోనే చేరాయి. భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా.. హార్దిక్ మూడు, అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టారు. అవేష్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. ఒక టీ20 మ్యాచ్‌లో మొత్తం పది వికెట్లూ భారత పేసర్ల ఖాతాలో చేరడం ఇదే తొలిసారి.
ఇవీ చదవండి: పాకిస్థాన్ బెంబేలు, భువీ, పాండ్య వికెట్ల వేట, టార్గెట్ ఎంతంటే
ఫ్యాన్స్ జాగ్రత్త, భారత్ పాక్ మ్యాచ్ చూస్తే రూ.5 వేలు జరిమానా