కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీమ్‌ఇండియా ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రజలను కోరాడు. కరోనాకు కచ్చితంగా అందరూ భయపడాలని అతనన్నాడు.
"కరోనాకు సంబంధించి భయపెట్టే విషయాలను వ్యాప్తి చేయొద్దని అంటున్న వారికి చెబుతున్నా. దయచేసి భయపడండి, బాగా భయపడండి. మహమ్మారిపై పోరాడేందుకు అదొక్కటే మార్గం. యుద్ధప్రాతిపదకన రక్షణ చర్యలు అవసరం" అని ఆదివారం అశ్విన్ ట్వీట్ చేశాడు.
ప్రజలు భౌతిక దూర నిబంధనలను ఉల్లంఘిస్తుండడాన్ని చూపెట్టే ఓ చిత్రాన్ని కూడా అశ్విన్ పంచుకున్నాడు. "ఇది నేటి చిత్రమే. భౌతిక దూరం పాటించకుండా జనం చౌక ధరల దుకాణం ముందు వరుసలో నిలబడ్డారు. భయమొక్కటే ఈ పరిస్థితిని మారుస్తుందంటే.. అందరూ భయపడాల్సిందే. కొంతమందికి ఇప్పటికీ కరోనా ప్రమాద తీవ్రత తెలియట్లేదు" అని అశ్విన్ పేర్కొన్నాడు.
తన కుటుంబంలో ఆరుగురు పెద్దవాళ్లు, నలుగురు పిల్లలు కరోనా బారిన పడడం వల్ల అశ్విన్ అర్ధంతరంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.