ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటుదక్కలేదు. తొలి టెస్టులో స్పిన్నర్ జడేజాకు మాత్రమే అవకాశం లభించగా, రెండో టెస్టులో శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని ఇషాంత్ శర్మ భర్తీ చేశాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఆడకపోవడానికి కారణమేంటనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై స్పందించాడు అశ్విన్. 'కుట్టీ స్టోరీ' యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌తో కలిసి ఈ అంశంపై చర్చించాడు.
లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో అశ్విన్ ఆడుదామనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించలేదని తెలిపాడు. తొలుత వాతావరణం పొడిగా ఉందని భావించినప్పటికీ మ్యాచ్ రోజు ఉదయం వర్షం పడిందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో నలుగురు పేసర్లతోనే భారత్ బరిలోకి దిగిందని స్పష్టం చేశాడు.
వర్షానికి ముందు.. భారత ఆటగాళ్లు కొందరు 'ఈరోజు నీకు ఆడే అవకాశం రావొచ్చు. సిద్ధంగా ఉండు' అని చెప్పి ఆశలు రేకెత్తించారని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కానీ, అల్పాహారం తీసుకునే సమయానికే వర్షం ప్రారంభమవడం వల్ల తనకు నిరాశే మిగిలిందని పేర్కొన్నాడు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో టెస్టులో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించింది. ఆగస్టు 25న ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జరగనుంది.
ఇదీ చదవండి: