భారత అండర్-19, టీమ్-ఏ జట్లు రాణించడంలో కీలకపాత్ర పోషించాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). అయితే ఆ జట్లకు కోచ్‌గా ఉన్నప్పుడు జట్టులో ఉండే ప్రతి ఆటగాడికి ఆడే అవకాశాన్ని ఇచ్చేవాడిని అని చెప్పాడు. సిరీసుకు ఎంపికై ఒక్క మ్యాచైనా ఆడకుంటే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసన్నాడు. చిన్నప్పుడు తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు.
"నేను ముందుగానే వారికి చెబుతున్నా. నాతో పాటు పర్యటనకు వచ్చిన వాళ్లకు ఆడే అవకాశం ఇస్తానని! చిన్నతనంలో నాకు ఓ అనుభవం ఉంది. ఏ జట్టులో ఉన్నప్పుడు ఓ పర్యటనకు వెళ్లాను. అప్పుడు నాకు ఆడే అవకాశం రాలేదు. అది భయకరమైన పరిస్థితి. నాలా ఎవరికి అలాంటి చేదు అనుభవం ఎదురుకాకూడదని జట్టులో ఉన్న ప్రతి ఆటగాడికి ఆడే అవకాశం కల్పిస్తా. ఓ టోర్నీలో మీరు 700-800 పరుగులు చేశారు. భారత్-ఏకు ఎంపికయ్యారు. కానీ నిరూపించుకోవడానికి మీకు అవకాశం రాలేదు. అప్పుడు సెలక్టర్ల దృష్టిలో మీరు వెనకబడతారు. తర్వాతి సీజన్లోనైనా 800 పరుగులు చేద్దామని భావిస్తారు. కానీ అదంత సులభం కాదు. అవకాశం కచ్చితంగా దొరుకుతుందన్న ఛాన్స్ లేదు. అందుకే నేను 11 మంది కాకుండా అత్యుత్తమ 15 మంది ఆడతారని చెబుతా. అండర్-19లో వీలైతే ప్రతి మ్యాచ్‌కు ఐదారు మార్పులు సాధ్యమే".
- రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్
జులైలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బీసీసీఐ గురువారం జట్టును ప్రకటించింది. అందులో శిఖర్ ధావన్(Shikhar Dhawan)ను కెప్టెన్‌గా, భువనేశ్వర్‌ను వైస్‌కెప్టెన్‌గా ఎంపికచేయగా.. జట్టు ప్రధానకోచ్‌గా రాహుల్ ద్రవిడ్(Dravid as Coach)ను నియమించింది.
ఒకప్పుడు భారత క్రికెటర్లకు సరైనా ఫిట్‌నెస్ సహాయకులు, సౌకర్యాలు ఉండేవి కావని రాహుల్ అన్నారు. అందుకు సంబంధించిన విజ్ఞానం కొరత ఉండేదన్నారు. రిజర్వు బెంచీపై ఉంటే, రోడ్డు పక్కన ఆడితే సరైన క్రికెటర్ కాలేరన్నారు. ఆటను ప్రేమిస్తేనే సాధ్యమని, అలాంటి చాలామంది క్రికెటర్లు ఇప్పుడు మనకున్నారని వెల్లడించారు. ఆటగాళ్లకు సరైన పిచ్‌లు, కోచింగ్ ఇవ్వడం, ఫిట్‌నెస్ సహాయకులను ఏర్పాటు చేయడం అవసరమన్నారు.
"1990, 2000ల్లో ఇలాంటి వసతులు లేవు. దేహదారుఢ్యానికి సంబంధించిన సమాచారం, విజ్ఞానం కొరత ఉండేది. మేం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫిట్‌నెస్ ట్రైనర్లను చూసేవాళ్లం. కానీ వారినుంచి మాకు ఎక్కువ సమాచారం దొరకేది కాదు. అతిగా జిమ్ చేయకండి. దేహం మొద్దు బారుతుందని చెప్పేవాళ్లు. పదేపదే బౌలింగ్ చేయండి. విరామం తీసుకుంటూ పరుగెత్తండి అనేవాళ్లు" అని ద్రవిడ్ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి.. WTC final: మరో వారం రోజులే సమయం!