Anilkumble Kohli issue: లెజెండరీ స్పిన్నర్ అనిల్‌కుంబ్లే హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు ఆటగాళ్లకు అండగా ఉండలేదని.. అలాగే డ్రెస్సింగ్ రూమ్‌లో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాడని అప్పటి సారథి విరాట్ కోహ్లీ భావించినట్లు టీమ్‌ఇండియా మాజీ మేనేజర్ రత్నాకర్ శెట్టి పేర్కొన్నారు. తాను రాసిన 'On Board: Test.Trial.Triumph. My years in BCCI' పుస్తకంలోని పలు ఆసక్తికర విషయాలను ఆయన ఇటీవల బయటపెట్టారు. అందులో కుంబ్లే టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా తప్పుకోవడానికి గల కారణాలను కూడా ప్రస్తావించారు. కాగా, 2016లో టీమ్‌ఇండియా కోచ్‌గా నియమితుడైన మాజీ సారథి.. ఏడాది పాటు జట్టును నడిపించి చివరికి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు.
"2016 మే నెలలో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో వీరేందర్ సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్‌ను నేను వాంఖడే మైదానంలో కలిశాను. అప్పుడు సెహ్వాగ్ నాతో మాట్లాడుతూ.. తనను టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నాటి బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్రీధర్ సూచించాడని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత నేను ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లగా.. అక్కడే సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్) మీటింగ్ జరిగింది. అందులో కమిటీ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడల్జీతో పాటు నేనూ, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ (వర్చువల్‌గా) సమావేశమయ్యాము. ఆ సమావేశంలో టీమ్‌ఇండియా భవిష్యత్ ప్రణాళికలు, హెడ్‌కోచ్‌గా ఎవరిని ఎంపిక చేద్దామనే విషయాలను వినోద్ అందర్నీ అడిగారు. అయితే, ఆయనే మళ్లీ కలగజేసుకొని.. కుంబ్లేనే కోచ్‌గా కొనసాగిద్దామని చెప్పారు. దాంతో నేనూ, కుంబ్లే షాకయ్యాం" అని రత్నాకర్ వివరించారు.
'ఇక వినోద్ అలా చెప్పేసరికి అంతకుముందు సెహ్వాగ్ నాతో చెప్పిన విషయాన్ని కుంబ్లేతో పంచుకున్నా. కచ్చితంగా శ్రీధర్.. సెహ్వాగ్‌ను కోచ్‌గా దరఖాస్తు చేయాలని సూచించలేదని అప్పుడు నాకు అర్థమైంది. మరోవైపు అదే సమయంలో కుంబ్లేను కోచ్‌గా కొనసాగించడానికి కూడా పలువురు ఇష్టపడట్లేదని అనిపించింది. అలాగే జట్టులో విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేల ఆలోచనా విధానాలు సైతం భిన్నంగా ఉన్నాయి. అప్పుడు కెప్టెన్‌దే పైచేయిగా సాగింది. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు లండన్‌లో మరో సమావేశం జరిగింది. దానికి కోహ్లీ, కుంబ్లేతో పాటు శ్రీధర్ పలువురు బీసీసీఐ పెద్దలు హాజరయ్యారు. ఈ విషయం తర్వాత తెలిసింది. అయితే, కుంబ్లేతో కోహ్లీ సంతోషంగా లేడని.. ఆటగాళ్లకు అండగా ఉండకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు సృష్టిస్తున్నాడని విరాట్ ఫీలయ్యాడు. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలయ్యాక కుంబ్లే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు" అని రత్నాకర్ తన పుస్తకంలో పొందుపరిచారు.
ఇదీ చూడండి: ప్రధానిపై విమర్శలు.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌పై నిషేధం