Former Pakistan Coach On Team India : ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. ఉత్కంఠ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసిన పాండ్య.. ఆపై వీరోచిత బ్యాటింగ్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హార్దిక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ జాబితాలోకి పాక్ మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ కూడా చేరాడు. పాండ్య ఉత్తమ క్రికెటర్‌గా ఎదుగుతున్నాడని కొనియాడాడు.
"అతడో అద్భుత ఆటగాడు. భారత్ 12మంది ఆటగాళ్లతో ఆడినట్లు అనిపించింది (హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనను ఉద్దేశిస్తూ). జాక్వెస్ కలిస్‌ను గుర్తుకుతెస్తూ.. నేను దక్షిణాఫ్రికాకు ఆడిన రోజుల్లోకి తీసుకెళ్లాడు. నలుగురు సీమర్లలో ఒకడిగా ఉంటూ, టాప్-5లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న క్రికెటర్ ఆ జట్టు సొంతం. అది ఓ అదనపు ఆటగాడిని ఆడించిన దానితో సమానం" అంటూ ఆర్థర్ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడాడు. 'భారత టీ20 లీగ్‌లోనూ హార్దిక్ నాయకత్వం అమోఘం. ఒత్తిడి సమయంలోనూ ఉత్తమంగా జట్టును నడిపించాడు. అతడు ఓ అద్భుత క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు' అంటూ ప్రశంసించాడు.
పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ ఆటతో అదరగొట్టాడు. మొదట 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆపై బ్యాటింగ్‌లో జట్టు వికెట్లు కోల్పోతూ ఇబ్బందుల్లో ఉన్న వేళ పాండ్య తన బ్యాట్‌ను ఝుళిపించాడు. 17 బంతుల్లోనే 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 33 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ దాదాపు 200స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం.
ఇవీ చదవండి: హార్దిక్, జడేజా ఉంటే అలా చేయడం అంత కష్టమా