టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ అదరగొట్టింది. నజీబుల్లా జద్రాన్ (59) అర్ధ శతకంతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ముందు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ రెండు, మార్క్ వాట్, జోష్ డేవీ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు హజ్రాతుల్లా జజాయి (44), మహమ్మద్ షెహజాద్ (22) జట్టుకు శుభారంభం అందించారు. వేగంగా ఆడే క్రమంలో షెహజాద్.. షరీఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహ్మానుల్లా (46)తో కలిసి మరో ఓపెనర్ హజ్రాతుల్లా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే మార్క్ వాట్ వేసిన పదో ఓవర్లో హజ్రాతుల్లా బౌల్డయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన నజీబుల్లా జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ నిలకడగా ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. 19 ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రహ్మానుల్లా క్యాచ్ ఔటై క్రీజు వీడాడు. షరీఫ్ వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి నజీబుల్లా జద్రాన్ ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన కెప్టెన్ మహమ్మద్ నబీ (11) నాటౌట్‌గా నిలిచాడు.