Aarka Sports Dhoni Defamation : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై దిల్లీహై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు అయింది. ధోనీ మాజీ బిజినెస్ పార్ట్‌నర్స్ ఆర్కా స్పోర్ట్స్(Aarka Sports) డైరెక్టర్లు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్ ఈ కేసు పెట్టారు.
వివరాళ్లోకి వెళితే. క్రికెట్ అకాడమీ విషయంలో మాజీ వ్యాపార భాగస్వాములు తనను రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ మహీ రీసెంట్గా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ ఇప్పుడు తిరిగి ధోనీపై పరువు నష్టం దావా(Dhoni Defamation suit) వేశారు. తమపై అసత్య ఆరోపణలు చేశాడని, తమ పరువుకు భంగం కలిగించాడని, అందుకుగానూ నష్టపరిహారం చెల్లించాలంటూ వారు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా సోషల్ మీడియా, టెలివిజన్ మీడియా సంస్థలను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. వీరి అభ్యర్థనపై ఉన్నత న్యాయస్థానం జనవరి 18న విచారణ చేపట్టనుంది.
అసలు కేసు గొడవ ఇదీ : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఆర్కా స్పోర్ట్స్ సంస్థ 2017లో మహేంద్ర సింగ్ ధోనీతో అగ్రీమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సదరు సంస్థ ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో క్రికెటర్‌కు వాటాను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అగ్రీమెంట్లోని కండిషన్స్‌ను కంపెనీ పాటించలేదంటూ ధోనీ ఒప్పందం నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలోనే తనకు రావాల్సిన చెల్లింపులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆర్కా స్పోర్ట్స్(Aarka Sports) డైరెక్టర్లు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశాడు.
ఈ విషయాన్ని రీసెంట్గా ధోనీ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని దివాకర్ ఖండించారు. వ్యవహారం కోర్టులో ఉండగానే విషయాన్ని ప్రెస్‌మీట్ పెట్టి ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. తమ పరువుకు భంగం కలిగించాడని తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
క్రికెట్ అకాడమీ పేరుతో రూ.15కోట్లు టోకరా- కోర్టుకెక్కిన ధోనీ
గద పట్టకపోయినా విజేతలే - టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే !