ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రిషభ్ పంత్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ షేన్ జర్గెన్‌సెన్ అన్నాడు. క్షణాల్లో మ్యాచును మలుపుతిప్పే సామర్థ్యం అతడికుందని ప్రశంసించాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై అతడెలా చెలరేగాడో చూశామన్నాడు. టీమ్‌ఇండియా బౌలింగ్ దళం చాలా బాగుందని కొనియాడాడు.
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న భారత్, న్యూజిలాండ్.. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఈ పోరు కోసం రెండు జట్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే విలియమ్సన్ సేన ఇంగ్లాండ్ చేరుకుంది. ఫైనల్స్‌కు ముందు ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. ప్రస్తుతం భారత జట్టు ముంబయిలో క్వారంటైన్ అయింది. త్వరలోనే యూకేకు చేరుకుంటుంది. కివీస్‌తో పోరు తర్వాత రూట్ సేనతో ఐదు టెస్టుల సిరీసు ఆడుతుంది.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితుల కోసం మరోసారి పాండ్య సోదరులు
"రిషభ్ పంత్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు. క్షణాల్లో ఆటను మార్చేయగలడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీసుల్లో అతడీ పని ఎంత బాగా చేశాడో మనమంతా చూశాం. అతడు సానుకూల ఆలోచనా ధోరణితో ఆడతాడు. కానీ అదే అతడి వికెట్ తీయడానికి మాకు అవకాశంగా మారుతుంది" అని జర్గెన్‌సెన్ అన్నాడు.
"మా బౌలర్లు అత్యంత కచ్చితత్వంతో బంతులు వేయాలి. ప్రశాంతంగా ఉండాలి. పంత్ పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే అతడు స్వేచ్ఛగా ఆడే బ్యాట్స్‌మన్. పైగా ఆపడం కష్టం. మేమీ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆర్‌సీబీకి ఆడేటప్పుడు కైల్ జేమీసన్, విరాట్ కోహ్లీ ఫైనల్స్ గురించి కచ్చితంగా మాట్లాడుకొనే ఉంటారు. జస్ప్రీత్ బుమ్రా, షమి, సిరాజ్, ఇషాంత్‌తో కూడిన టీమ్‌ఇండియా బౌలింగ్ దళం బాగుంది. ఇక శార్దూల్ ఠాకూర్ బ్యాటింగూ చేయగలడు" అని జర్గెన్‌సెన్ తెలిపాడు.
ఇదీ చదవండి: రైల్వే విధుల నుంచి రెజ్లర్ సుశీల్ సస్పెండ్!