భారత్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలిచిన టీమ్ఇండియా.. ఇప్పుడు కోహ్లీ సారథ్యంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. అదే ఉత్సాహంతో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది కోహ్లీసేన. జూన్ 18న న్యూజిలాండ్‌తో జరగబోయే ఛాంపియన్షిప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచస్థాయి ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ ఇరుజట్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్టు ఫార్మాట్లో అద్భుత గణాంకాలున్న కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం.
స్టీవ్ వా(ఆస్ట్రేలియా 1999-2004)
క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికీ దాదాపు ఈ పేరు సుపరిచితమే. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో స్టీవ్ వా ముందంజలో ఉంటాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున 168 టెస్టులు ఆడిన స్టీవ్ వా.. ఐదేళ్ల పాటు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్టీవ్‌వా సారథ్యంలో ఆడిన 57 మ్యాచ్‌ల్లో 41 గెలుపొంది.. కేవలం 9 మ్యాచ్‌ల్లో ఓడింది. కెప్టెన్‌గా స్టీవ్ వా విజయ శాతం 71.92. వా కెప్టెన్సీలో 1999 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది.
రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా 2004-10)
మరో క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఆస్ట్రేలియా విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 77 టెస్టులకు సారథిగా వ్యవహరించిన రికీ.. 62.33 శాతం సక్సెస్ రేటుతో 48 విజయాలు అందించాడు. మరో 16 మ్యాచ్‌లు చేజారాయి. ఇతని నాయకత్వంలో ఆసీస్ రెండు సార్లు ప్రపంచకప్‌ను గెలుపొందింది.
విరాట్ కోహ్లీ(ఇండియా-2014 నుంచి ప్రస్తుతం)
సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. మాజీ సారథి ధోనీతో పాటు కోహ్లీ సమానంగా 60 టెస్టుల్లో ఇండియాకు నాయకత్వం వహించాడు. కానీ, ఇద్దరిలో విరాటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిపించిన ఘనతను అందుకున్నాడు. 60 శాతం విజయాలతో 36 మ్యాచ్‌లను గెలిపించాడు కోహ్లీ. మరో 10 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. 14 టెస్టుల్లో ఓడిపోయింది. 2018-19 సీజన్లో ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ విజయాన్ని సాధించిన జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మొత్తం 17 టెస్టుల్లో 520 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించింది టీమ్ఇండియా.
మైక్ బ్రేర్లీ(ఇంగ్లాండ్ 1977-81)
ఇంగ్లాండ్ జట్టుకు సారథ్యం వహించిన వారిలో విజయవంతమైన టెస్టు కెప్టెన్ మైక్ బ్రేర్లీ. ఇతడి కెప్టెన్సీలో 31 మ్యాచ్‌ల్లో.. 18 విజయాలను నమోదు చేసుకుంది ఇంగ్లీష్ జట్టు. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే పరాజయం చవిచూశాడు. మరో 9 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. సారథిగా మైక్ విజయాల శాతం 58.06.
కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్-2014 నుంచి ప్రస్తుతం)
న్యూజిలాండ్ అత్యుత్తమ కెప్టెన్లలో కేన్ విలియమ్సన్ ముందంజలో ఉంటాడు. ఇంతవరకు 35 మ్యాచ్‌ల్లో సారథిగా వ్యవహరించిన కేన్.. 21 టెస్టుల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో 8 మ్యాచ్‌లు ఓడిపోగా.. 6 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇతని విజయాల శాతం 60. 2019 ప్రపంచకప్ జట్టుకు సారథిగా ఉన్నాడు విలియమ్సన్. ఇటీవల టీమ్ఇండియాను 2-0 తేడాతో ఓడించిన జట్టుకూ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇదీ చూడండి: WTC Final: 'కివీస్ గెలవదు.. కారణాలివే..'