India top performance cricketers 2021: అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది టెస్టు క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరించింది. టీమ్ఇండియా విషయానికొస్తే ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత జట్టు.. ఆ తర్వాత కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఓటమి ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. అయితే ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఇక ఈ ఏడాది పూర్తయ్యేటప్పటికి దక్షిణాఫ్రికాతో మరో సిరీస్ ఆడనుంది. ఏదేమైనప్పటికీ గెలుపోటములతో ఈ సంవత్సరాన్ని పూర్తి చేసిన టీమ్ఇండియాలో టెస్టు ఫార్మాట్ పరంగా కొందరు భారత ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నారు. వారెవరో తెలుసుకుందాం..
ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన
Axar patel five wicket haul: ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడింది టీమ్ఇండియా. ఇందులో భాగంగా రెండో మ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు అక్షర్ పటేల్. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌ల్లో టీమ్ఇండియా విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం.
అసాధారణ పోరాటం
Bumrah lord test innings: బుమ్రా ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా టెస్టు క్రికెట్లో తనవంతుగా ఉత్తమంగా ఆడి గుర్తుండిపోయే ప్రదర్శనలు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఇతడు 25 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతడు మహ్మద్ షమీతో కలిసి చేసిన బ్యాటింగ్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డ్రాతో గట్టెక్కాల్సిన మ్యాచ్‌ను వీరిద్దరూ అసాధారణ పోరాటం చేసి గెలుపు దిశగా నడిపించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
విమర్శలకు సమాధానం
Rishabh pant Australia tour: వికెట్ కీపర్ పంత్.. ఈ ఏడాది ఆకట్టుకునే ప్రదర్శన చేసి తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. 2021లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఏడాది ప్రారంభంలో గబ్బా టెస్టు విజయంలో 97, 89* పరుగులతో కీలకంగా వ్యవహరించి అభిమానుల మనసుల్లో నిలిచాడు. మొత్తంగా ఈ ఏడాది 11 మ్యాచ్‌లు ఆడి 41.52 సగటుతో 706 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి.
విదేశీ గడ్డపై తొలి సెంచరీ
Rohit sharma first overseas test century: రోహిత్ శర్మ.. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆడగాడిగా నిలిచాడు. ఓవల్ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసి.. విదేశీ గడ్డపై తన తొలి టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా ఈ ఏడాది 11 మ్యాచ్‌లు ఆడి 47.68 సగటుతో 906 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి.
అత్యధిక వికెట్లు తీసిన ఘనత
Ravichandran ashwin wickets in 2021: రవిచంద్రన్ అశ్విన్.. ఈ ఏడాది నిలకడగా రాణించాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన, చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు. మొత్తంగా ఈ ఏడాది ఎనిమిది మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీసి అత్యధిక వికెట్లను పడగొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు.
ఇదీ చూడండి: ఆ అపురూప క్షణాల్ని గొప్పగా ఆవిష్కరించారు: కోహ్లీ