ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరఫున తొలి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆమెతో పాటు కాంస్యం గెలిచిన సాయిప్రణీత్‌కు... టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, బ్యాట్స్‌మెన్ హనుమ విహారి శుభాకాంక్షలు చెప్పారు.
"భారత క్రీడా రంగంలో సింధు గెలుపు గొప్ప మలుపు. భారతీయులు ఆమెను చూసి గర్వపడాలి. భవిష్యత్తులో దేశానికి ఎన్నో విజయాలు అందిస్తుందని నమ్ముతున్నా" -హనుమ విహారి, టీమిండియా బ్యాట్స్‌మెన్
"ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచినందుకు శుభాకాంక్షలు. నీ నిబద్ధతకు, పట్టుదలకు, నైపుణ్యానికి ఈ విజయమే నిదర్శనం. దేశమంతా నిన్ను చూసి గర్విస్తుంది. కోచ్ గోపీచంద్‌కు అభినందనలు. " -ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా చీఫ్ సెలక్టర్
"ఛాంపియన్లను ఓడించి అద్భుత ప్రదర్శన చేసింది సింధు. కోచ్‌లు గోపీచంద్, కిమ్ కృషికి అభినందనలు. సాయి ప్రణీత్ కాంస్యం దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు. భవిష్యత్తు ఆటగాళ్లకు వీరి ప్రదర్శన నిజమైన ప్రేరణ" -అజయ్.కె.సింగానియా, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య జనరల్ సెక్రటరీ
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధుకు ఇది ఐదో పతకం. ఈ టోర్నీలో అత్యధిక పతకాలు సాధించిన జాంగ్ నింగ్ సరసన నిలిచింది తెలుగుతేజం. ఇప్పటికే ఆమె ఖాతాలో రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.
పురుషుల విభాగంలో రజతం సొంతం చేసుకున్నాడు సాయి ప్రణీత్. 36 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టిన భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బాయ్).. సింధుకు రూ.20లక్షలు, ప్రణీత్‌కు రూ.5 లక్షల నజరానా ప్రకటించింది.