ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి వైరస్ సోకింది. దీంతో మొత్తంగా ఈ టోర్నీలో పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటికే ఈ వైరస్ కేసుల వల్ల 72 మంది ఆటగాళ్లు క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. వీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి అవకాశం లేదు.
మార్చే ప్రసక్తే లేదు..
ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో ఐదు సెట్ల ఫార్మాట్‌ను మహిళల సింగిల్స్‌లో తరహా మూడు సెట్లకు కుదించాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఫార్మాట్లో ఎలాంటి సవరణలు చేయడం కుదరదని తేల్చిచెప్పేశారు టోర్నీ ఓపెన్ డైరెక్టర్ క్రెయిగ్ టైలీ.
"పురుషుల విభాగంలో ఐదు సెట్లలో మూడు గెలవాలి, మహిళల విభాగంలో మూడు సెట్లలో రెండు గెలవాలి. ఎప్పటినుంచో దీన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి ఇందులో ఎలాంటి మార్పు జరగదు."
-క్రెయిగ్ టైలీ, ఆస్ట్రేలియన్ ఓపెన్ డైరెక్టర్.
కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం వల్ల తామేమీ ఆశ్చర్యపోవడం లేదని అన్నారు క్రెయిగ్. ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించినట్లు చెప్పారు. టోర్నీ జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 8 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కరోనా కలకలం