భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కేరళలో సందడి చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన సింధును కేరళ రాష్ట్రప్రభుత్వం సత్కరించింది. ఆ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం జరిగిన సన్మాన సభలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సింధును కొనియాడారు.
కేరళ దేవాలయాల సందర్శన..
మంగళవారం రాత్రే తిరువనంతపురం వెళ్లిన సింధు.. బుధవారం ఉదయం తల్లి విజయతో కలిసి కేరళలోని ప్రఖ్యాత దేవాలయాలను సందర్శించింది. ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభస్వామి, అట్టుక్కల్ భగవతి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది.
అనంతరం తిరువనంతపురంలోని కేరళ ఒలింపిక్ భవన్‌కు వెళ్లింది సింధు. అక్కడ ఆ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సునీల్ కుమార్ చేతుల మీదుగా రూ. 10లక్షల చెక్కును అందుకుంది.
రోడ్ షోలో ఘనంగా ఆహ్వానం..
తర్వాత కేరళ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మానసభకు బయల్దేరింది సింధు. రోడ్ షోలో అడుగడుగునా విద్యార్థులు ఆమెను ఘనంగా ఆహ్వానించారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని సింధుకు జేజేలు పలికారు.
సింధు పోరాట పటిమ యువతకు ఆదర్శం..
అనంతరం జరిగిన సన్మాన సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సింధును కొనియాడారు. ఆటలో ఆమె పోరాటపటిమను చూసి యువత ఎంతో నేర్చుకోవాలని.. కేరళ రాష్ట్ర క్రీడాభివృద్ధిలో సింధు భాగం కావాలని తెలిపారు.
ఒలింపిక్స్ స్వర్ణమే లక్ష్యం..
2020 టోక్యో ఒలింపిక్సే తన తర్వాత లక్ష్యమని తెలిపింది సింధు. కేరళలో తనను ఘనంగా ఆహ్వానించారని, ఇక్కడ ప్రజలు చాలా మంచివారని చెప్పింది. గతంలో తాను కేరళ వచ్చినట్లు గుర్తు చేసింది.
"ఈ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. క్రీడాకారులకు కేరళ రాష్ట్రప్రభుత్వం మద్దతుగా నిలిచినందుకు ముఖ్యమంత్రి విజయన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం" -పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
2016 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తర్వాత తొలిసారి కేరళకు వెళ్లింది సింధు. ఇటీవలే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆమె.. అక్టోబరు 15 నుంచి ఆరంభం కాబోతున్న డెన్మార్క్ ఓపెన్‌లో తలపడనుంది.
ఇదీ చదవండి: ప్రియ పునియా విధ్వంసం... టీమిండియా ఘన విజయం