భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ టోక్యో ఒలింపిక్స్ అర్హత పొందే అవకాశాలు రోజురోజుకు కష్టంగా మారుతున్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి తమ దేశానికి వచ్చే విమాన సేవలను మలేసియా, సింగపూర్ రద్దు చేయడమే ఇందుకు కారణం. దీంతో మలేసియా ఓపెన్(మే 25-30), సింగపూర్ ఓపెన్‌లో(జూన్ 1-6) భారత షట్లర్లు పాల్గొనే విషయంపై సందేహాలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ అర్హత ప్రక్రియలో ఇవే చివరి ప్రధాన టోర్నీలు.
ఇప్పట్లో ఇవ్వలేమని..
ఈ నేపథ్యంలో భారత దేశ బ్యాడ్మింటన్ టీమ్‌ను అనుమతించేలా మన క్రీడా మంత్రిత్వ శాఖ మలేసియా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కానీ ఆ దేశ ప్రభుతం.. మన షటర్ల ప్రయాణ అనుమతిని ఇప్పట్లో ఇవ్వలేమని తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశంలోని భారత హై కమిషన్ తెలిపినట్లు శాయ్ తెలిపింది. దీంతో మలేసియా ఓపెన్ నుంచి భారత షటర్లు తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. కాబట్టి ఈ రెండు టోర్నీల్లో నెగ్గి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని ఎదురుచూస్తున్న సైనా, శ్రీకాంత్‌కు ఎదురుదెబ్బ తగలనుంది!. మరోవైపు పీవీ సింధు, సాయి ప్రణీత్, సాత్విక్‌రాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి కూడా ఇందులో పాల్గొనాల్సి ఉంది.
ర్యాంకులు పడిపోయే అవకాశం..
మహిళల, పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-16లో ఉన్న షట్లర్లే ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటారు. ప్రస్తుతం సైనా 19వ, శ్రీకాంత్ 14వ ర్యాంకులో ఉన్నారు. అయితే ఈ టోర్నీల్లో వీరు పాల్గొనకపోతే వీరి ర్యాంకులు మెరుగవ్వకపోవడమే కాకుండా ఇంకా పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి భారత్ నుంచి పీవీ సింధు, సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ జోడీకి మాత్రమే ఆ మెగా క్రీడలకు అర్హత సాధించే ర్యాంకింగ్ ఉంది.