కరోనా నేపథ్యంలో ఇప్పటికీ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దవుతూనే ఉన్నాయి. పలు ప్రముఖ సిరీస్లు వాయిదా పడగా.. తాజాగా మరో నాలుగు టోర్నీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్). ఇందులో తైపీ ఓపెన్, కొరియా ఓపెన్ సహా మరో రెండు టోర్నీలు ఉన్నాయి.
తైపీ ఓపెన్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగాల్సింది. కొరియా ఓపెన్ సెప్టెంబర్ 8 నుంచి 13 నుంచి నిర్వహించాల్సింది. అయితే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గకపోవడం వల్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు నిర్వహకులు. వీటితో పాటు చైనా ఓపెన్(సెప్టెంబర్ 15-20), జపాన్ ఓపెన్(సెప్టెంబర్ 22-27) కూడా రద్దయ్యాయి.
ఆటగాళ్లు, వీక్షకులు, వాలంటీర్లు, అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యం దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ సెక్రటరీ జనరల్ థామస్ వెల్లడించారు. టర్నీలు రద్దు చేయడం నిరాసకు గురిచేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చైనా మాస్టర్స్, డచ్ ఓపెన్లను రద్దు చేస్తూ బీడబ్ల్యూఎఫ్ నిర్ణయం తెలిపింది. కరోనా కారణంగా ఒలింపిక్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.