బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్(డబ్ల్యూటీఎఫ్ )లో వరుస ఓటములు చవిచూశారు భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్. గురువారం జరిగిన గ్రూప్ దశ రెండో మ్యాచ్‌లో రచనోక్ చేతిలో సింధు వరుస సెట్లలో ఓడింది. తైవాన్‌కు చెందిన వాంగ్జుతో తీవ్రంగా పోరాడినప్పటికీ శ్రీకాంత్‌కు ఓటమి తప్పలేదు. ఫలితంగా వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత షటర్ల కథ దాదాపు ముగిసినట్లే.
బుధవారం ఆరంభ మ్యాచ్‌లో ఓడిన సింధు.. రెండో మ్యాచ్‌లో గట్టిగానే పోరాడింది. థాయ్‌లాండ్ షట్లర్ రచనోక్ ఇంటానాన్‌తో తొలి గేమ్‌లో ఓ దశలో 18-18తో సమంగా నిలిచింది. అయితే వేగంగా పుంజుకున్న ఇంటానాన్ 21-18తో గేమ్‌ను దక్కించుకుంది. ఇక రెండో గేమ్ కూడా హోరాహోరీగా మొదలైనా.. క్రమంగా ఇంటానాన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ సెట్లో 21-13తో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో సింధు నాకౌట్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో గేమ్‌లోనూ ఓటమి చవిచూశాడు కిదాంబి శ్రీకాంత్. వాంగ్జు చేతిలో 21-19, 9-21,19-21తో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో చూపిన ఆధిపత్యం చివరి వరకు నిలబెట్టుకోలేకపోయాడు శ్రీకాంత్. రెండో సెట్ పూర్తిగా వాంగ్జు చేతిలోకి వెళ్లిపోయింది. మూడో గేమ్‌లో తీవ్రంగా పోరాడినప్పటికీ భారత షట్లర్‌కు నిరాశ తప్పలేదు.
ఇదీ చూడండి: డబ్ల్యూటీఎఫ్ ఆరంభ మ్యాచ్‌ల్లో సింధు, శ్రీకాంత్ ఓటమి