కొరియా , డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత షట్లర్లు.. చైనా ఓపెన్‌పై దృష్టి పెట్టారు. స్టార్ క్రీడాకారిణిలు పీవీ సింధు, సైనా నెహ్వాల్.. మంగళవారం నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీలో సత్తాచాటాలని ఆశిస్తున్నారు. ఈ టోర్నీకి కిదాంబి శ్రీకాంత్ దూరం కానున్నాడు.
శ్రీకాంత్ దూరం..
నూమెరో యూనో, కెంటో మెమోటా లాంటి స్టార్ ఆటగాళ్లతో శ్రీకాంత్ పోటీపడాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ టోర్నీకి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుని ఆశ్చర్యానికి గురిచేశాడు. తర్వాతి వారం జరగనున్న హాంకాంగ్ ఓపెన్‌లో సత్తాచాటాలని అనుకుంటున్నాడు.
టైటిల్ కోసం సింధు..
ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్షిప్ నెగ్గిన తర్వాత మిగతా టోర్నీలో అంతగా ప్రభావం చూపని సింధు.. చైనా ఓపెన్‌లో ఆకట్టుకోవాలని అనుకుంటోంది. ఆరంభ రౌండ్లలో జర్మనీ క్రీడాకారిణి యోన్లీ, చైనాకు చెందిన 8వ సీడ్ షట్లర్ కై యాన్యాన్తో తలపడనుంది. ముందు రౌండ్లలో నెగ్గుకుంటూ వస్తే కరోలిన్ మారిన్‌తో గానీ, ప్రపంచ నెంబర్ వన్ తైజు యింగ్‌తో గానీ క్వార్టర్స్‌లో తలపడనుంది సింధు.
ఇటీవల జరిగిన టోర్నీల్లో పెద్దగా సత్తాచాటని సైనా నెహ్వాల్.. చైనాలో సత్తాచాటాలని భావిస్తోంది. ఆరంభ రౌండ్లలో గెలిస్తే జపాన్ స్టార్ షట్లర్ యమగూచితో తలపడే అవకాశముంది. మరోవైపు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్ తొలి రౌండ్లో ఇండోనేషియా క్రీడాకారుడు టామీతో తలపడనున్నాడు.
సమీర్ వర్మ హాంకాంగ్ క్రీడాకారుడు లీతో, ప్రణయ్.. డెన్మార్క్ షట్లర్ రస్మస్ను ఢీ కొట్టనున్నాడు. పారుపల్లి కశ్యప్ థాయ్‌లాండ్ షట్లర్ సిట్టికమ్తో ఆరంభ రౌండ్లో తలపడనున్నాడు.
ఇటీవల ఫ్రెంచ్ ఓఫెన్ రన్నరప్‌గా నిలిచిన భారత డబుల్స్ జోడీ సాత్విక్ - చిరాగ్.. తొలిరౌండ్లో కొరియాకు చెందిన కిమ్ -లీతో తలపడనుంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప - సిక్కిరెడ్డి జోడీ చైనా ద్వయం లీ వెన్ - జెంగ్ యూతో ఆడనుంది.
ఇదీ చదవండి: భారత్-బంగ్లా: రెండో టీ20కి తుపాను ముప్పు తప్పదా..!