సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లందరూ నిష్క్రమించిన వేళ.. సౌరభ్ వర్మ ఒక్కడే నిలిచాడు. లఖ్‌నవూ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ సెమీస్‌లో కొరియాకు చెందిన హీ క్వాంగ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు.
పురుషుల సింగిల్స్ విభాగంలో 21-17, 16-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు సౌరభ్. అనతంరం రెండో గేమ్‌లో కొరియన్ ఆటగాడు విజృంభించాడు. ఫలితంగా ఆ సెట్ కోల్పోయాడు భారత షట్లర్.
నిర్ణయాత్మక మూడో గేమ్ నువ్వానేనా అన్నట్లు సాగింది. అయితే సౌరభ్ వ్యూహాల ముందు ప్రత్యర్థి లొంగిపోయాడు. ఫలితంగా మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. తుదిపోరులో తైవాన్ క్రీడాకారుడు వాంగ్ జు వీతో తలపడనున్నాడు సౌరభ్.
మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ల ప్రయాణం ముగిసింది. సెమీస్‌లో రితుపర్ణ దాస్.. థాయ్‌లాండ్ ప్లేయర్ చైవాన్ చేతిలో పరాజయం పాలైంది. 22-24, 15-21 తేడాతో వరుస సెట్లలో ఓడి ఇంటిముఖం పట్టింది.
ఇదీ చదవండి: శంషాబాద్ ఘటన సిగ్గుచేటు: విరాట్