భారత పారా బ్యాడ్మింటన్ షట్లర్ పలక్ కోహ్లీ(Palak Kohli) అరుదైన ఘనత సొంతం చేసుకోనుంది. పారాలింపిక్స్(Tokyo Paralympics)లో బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీపడే తొలి భారత పారా షట్లర్‌గా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటికే డబుల్స్‌లో వచ్చే నెలలో ఆరంభమయ్యే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన పలక్‌కు మహిళల సింగిల్స్ (ఎస్‌యూ5), మిక్స్‌డ్ డబుల్స్(ఎస్‌ఎల్3-ఎస్‌యూ5)లోనూ పాల్గొనాలని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) (BWF) నుంచి ఆహ్వానం అందింది. 18 ఏళ్ల పలక్ ఈ పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన అత్యంత పిన్న వయస్సు గల పారా షట్లర్‌గా నిలవనుంది. ఈ టోక్యో క్రీడలతోనే పారాలింపిక్స్‌లో పారా బ్యాడ్మింటన్ అరంగేట్రం చేయనుంది.
9 విభాగాలు.. 42 మంది..
రానున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు 9 విభాగాల్లో పాల్గొననున్నారు. గతంతో పోలిస్తే అథ్లెట్ల సంఖ్యతో పాటు క్రీడల సంఖ్య కూడా పెరిగింది. 2012 లండన్ పారాలింపిక్స్‌లో 10 మంది అథ్లెట్లు 4 క్రీడలలో పాల్గొనగా.. 2016 రియో పారాలింపిక్స్‌కు వచ్చే సరికి 19 మంది ఆటగాళ్లు 5 విభాగాల్లో పోటీ పడ్డారు. తాజా ఈవెంట్లో 42 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఆగస్టు 24 నుంచి టోక్యో వేదికగా పారాలింపిక్స్ జరగనున్నాయి.
ఇదీ చదవండి: పారాలింపిక్స్‌లో ప్రేక్షకులు.. ఒలింపిక్స్‌లో మాత్రం!