ఒకవైపు వైకల్యంతో పుట్టానన్న వేదన! మరోవైపు వెనక్కి లాగే మాటలు! అడుగడుగునా అడ్డంకులు.. అయినా 18 ఏళ్ల పలక్ కోహ్లి ఆగలేదు.. పారా బ్యాడ్మింటన్‌లో ఎదిగింది! టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించి సత్తా చాటింది. పారాలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టనున్న బ్యాడ్మింటన్‌లో మహిళల డబుల్స్ బెర్తు దక్కించుకుని ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్సు పారా షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. తనకన్నా సీనియర్ పారుల్‌తో కలిసి ఆమె ఈ మెగా ఈవెంట్లో ఆడబోతోంది.
పోరాటం లేకుంటే జీవితంలో విజయం దక్కదు. అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్లి సాగిస్తున్న ఆ పోరాటమే ఇప్పుడు పలక్ పేరు మార్మోగేందుకు కారణమైంది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఈ టీనేజీ సంచలనానికి పుట్టుక నుంచే ఎడమ చేతి లోపం ఉంది. తను పెరిగినా ఆ చేయి మాత్రం పూర్తిగా ఎదగలేకపోయింది. పాఠశాలలో తోటి మిత్రులు కేరింతలు కొడుతూ ఆటలాడుతుంటే తాను మాత్రం దూరంగా ఉండేది. తన చేయి బాగాలేదని, ఆటలు ఆడొద్దని ఉపాధ్యాయులు చెప్పడమే అందుకు కారణం. కానీ ఆ వైకల్యం, ఆ వెనక్కి లాగే మాటలు తనను ప్రతిష్ఠాత్మక టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించకుండా ఆపలేకపోయాయి. అందరూ వద్దంటూ వారించిన ఆటల్లోనే తన సత్తాచాటాలనే కసి పెంచుకుని, తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంది.
ఆ పరిచయం.. 14 ఏళ్ల వరకూ పలక్ జీవితం సాధారణంగానే గడిచింది. కానీ 2016లో ఓ రోజు షాపింగ్ మాల్‌లో బ్యాడ్మింటన్ కోచ్ గౌరవ్ ఖన్నాకు పరిచయం కావడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆమె గురించి తెలుసుకున్న ఖన్నా.. పారా బ్యాడ్మింటన్ ఆడేందుకు ప్రయత్నించాలని సలహా ఇచ్చాడు.. అప్పుడు పలక్ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక రోజు పాఠశాలలో వైకల్యాన్ని ఎత్తి చూపుతూ హ్యాండ్‌బాల్ ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకోవడం వల్ల బ్యాడ్మింటన్ ఆడాలనే ఆలోచన మొదలై గౌరవ్‌ను సంప్రదించింది. లఖ్‌నవూలోని అతని పారా బ్యాడ్మింటన్ అకాడమీకి మకాం మార్చింది. తక్కువ కాలంలోనే వేగంగా ఎదిగింది. 2019లో తన తొలి పారా బ్యాడ్మింటన్ జాతీయ టోర్నీలోనే మూడు స్వర్ణాలు (మహిళల సింగిల్స్, డబుల్స్, అండర్-19 సింగిల్స్) కొల్లగొట్టింది.
ఆ నొప్పితోనే..
కెరీర్ ఊపందుకుంటున్న దశలో 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత ఆమె ఎడమ కాలి పిక్కకు గాయమైంది. తీవ్రమైన నొప్పితో మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కోర్టులో అడుగుపెట్టినా మునుపటిలా వేగంగా కదల్లేకపోయింది. అయితే నొప్పి బాధిస్తున్నప్పటికీ.. ఆ కాలి పిక్కపై ఎక్కువ భారం పడకుండా ఆడేలా తన ఆటతీరును మార్చుకుంది. స్ట్రోక్స్‌లో మార్పులు చేసుకుంది. పిక్కపై ప్రభావం పడకుండా.. మొత్తం శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఆడేలా నైపుణ్యాలు మెరుగుపర్చుకుంది. గతేడాది లాక్‌డౌన్ కారణంగా దాదాపు క్రీడాకారులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఆమె మాత్రం ఇంటి ముఖం చూడలేదు. టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించే దిశగా సాధన ఆపలేదు. ఆ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడం వల్ల కాస్త నిరాశ చెందినప్పటికీ.. తన 12వ తరగతి బోర్డు పరీక్షలు వదిలేసి మరీ ర్యాంకింగ్ పాయింట్ల కోసం అర్హత టోర్నీలు ఆడింది. దాదాపు ఏడాది తర్వాత ఈ ఏడాది దుబాయ్ టోర్నీలో సింగిల్స్‌లో బరిలో దిగి రజతం గెలిచింది. అదే టోర్నీలో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఒక్కో కాంస్యం నెగ్గింది. డబుల్స్‌లో పారుల్‌తో కలిసి పారాలింపిక్స్ అర్హత సాధించిన పలక్.. సింగిల్స్‌లోనూ బెర్తు దక్కించుకునే అవకాశం ఉంది.