ప్రతిష్ఠాత్మక థామస్ అండ్ ఉబర్ కప్‌లో భారత్ బలమైన జట్లను బరిలో దింపింది. కిదాంబి శ్రీకాంత్ నేతృత్వంలో థామస్ కప్‌లో.. పి.వి. సింధు సారథ్యంలో ఉబర్ కప్‌లో ఆడనుంది. భారత జట్లను గురువారం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. అక్టోబరులో జరిగే డెన్మార్క్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్ టోర్నీల్లో పాల్గొనే ఆరుగురు క్రీడాకారుల్ని ఎంపిక చేసింది. గాయం కారణంగా సాయి ప్రణీత్ థామస్ కప్‌కు దూరమయ్యాడు.
థామస్ అండ్ ఉబర్ కప్ కోసం హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న జాతీయ శిక్షణ శిబిరాన్ని బాయ్ రద్దు చేసింది. క్రీడాకారులకు ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలో సడలింపు లభించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కడి వాళ్లు అక్కడే ప్రాక్టీస్ కొనసాగించాలని బాయ్ షట్లర్లకు చెప్పింది. అక్టోబరు 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో థామస్ అండ్ ఉబర్ కప్ జరుగనుంది.
థామస్ కప్: కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, లక్ష్యసేన్, శుభంకర్ దేవ్, సిరిల్‌వర్మ, మను అత్రి, సుమీత్‌రెడ్డి, అర్జున్, ధ్రువ్, కృష్ణ ప్రసాద్
ఉబర్ కప్: పి.వి.సింధు, సైనా నెహ్వాల్, ఆకర్షి, మాళవిక, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి, పూజ దండు, సంజన, పూర్విష, జక్కంపూడి మేఘన
డెన్మార్క్ ఓపెన్ , డెన్మార్క్ మాస్టర్స్: శ్రీకాంత్, లక్ష్యసేన్, పి.వి.సింధు, సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి