New Indian Badminton Coach: భారత బ్యాడ్మింటన్ జట్టు కోచ్‌లుగా ముల్యో హండోయో (ఇండోనేసియా), టాన్ కిమ్ హెర్ (మలేసియా) మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నారు. సింగిల్స్‌కు ముల్యో, డబుల్స్‌కు కిమ్‌ను కోచ్‌లుగా ఎంపిక చేయడం దాదాపుగా ఖాయమైంది. ఏథెన్స్ ఒలింపిక్స్ విజేత తౌఫిక్ హిదాయత్‌కు కోచ్‌గా వ్యవహరించిన ముల్యో.. 2017లో కొద్దికాలం భారత సింగిల్స్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, ప్రణయ్‌లు అద్భుతంగా రాణించారు. 2017లో శ్రీకాంత్ 4 సూపర్ సిరీస్ టైటిళ్లుగా నెగ్గగా.. సాయి ప్రణీత్ ఒక టోర్నీలో విజేతగా నిలిచాడు.
సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టిలను భారత అత్యుత్తమ డబుల్స్ జోడీగా తీర్చిదిద్దడంలో కిమ్ కీలకపాత్ర పోషించాడు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో సాత్విక్- చిరాగ్ జోడీ రజతం సాధించింది. ఆ క్రీడల్లో భారత జట్టు స్వర్ణం నెగ్గడంలోనూ కిమ్‌ది ముఖ్యభూమికే. పదవీకాలం పూర్తవకముందే 2017 డిసెంబరులో రాజీనామా చేసిన ముల్యో.. సింగపూర్ జట్టుకు కోచ్‌గా వెళ్లాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు కోచ్‌గా నియమితుడైన కిమ్.. 2019లో రాజీనామా చేశాడు. జపాన్ జట్టుకు కోచ్‌గా వెళ్లాడు.
"కోచ్‌లు కావాలని నవంబరులో బాయ్ ప్రకటన ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న వాళ్లలో ముల్యో, కిమ్ ఉన్నారు. గతంలో భారత క్రీడాకారులతో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల వారి సేవల్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం" అని బాయ్ కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపాడు.