కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు, కోచ్‌లకు సాయంగా నిలవడం కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ), భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) చేతులు కలిపాయి. అవసరాల్లో ఉన్న వాళ్లకు ఆర్థికంగా, వైద్యపరంగా అండగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. అయితే ఈ సాయం కోసం అంతర్జాల వేదికగా అథ్లెట్లు, కోచ్‌లు తమ అవసరాలను విన్నవించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: సీఎస్కే దాతృత్వం.. 450 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వితరణ
ఈ సాయాన్ని వాళ్లకు చేర్చేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాల వారీగా ఐఓఏ.. ప్రతినిధులను ఎంపిక చేసింది. అందులో తెలంగాణ నుంచి జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు, జగదీశ్వర్ రావు, మహేశ్ ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి రాఘవేంద్ర, సుభాన్ బాష ఎంపికయ్యారు. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ అథ్లెట్లు, కోచ్‌లు www.research.net/r/sai-ioa-covid-19 లింక్ ఓపెన్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని జగన్మోహన్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు గంగూలీ.. భారత క్రికెటర్లకు వ్యాక్సిన్!