టోక్యోలో ఒలింపిక్ పతకమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు.. భారత షటిల్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి చెబుతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఇండియా ఓపెన్‌లో ఆడనున్న ఈ జోడీ.. తమ ఆట శైలిని మార్చుకున్నట్లు వెల్లడించింది.
కొత్త కోచ్ మాథియాస్ బో ఆధ్వర్యంలో ప్లాన్-బీని అమలు చేయనున్నట్లు తెలిపారు. మాథియాస్ కోచ్‌గా ఇంగ్లాండ్ ఓపెన్‌లో తొలి టోర్నీ ఆడిన ఈ జంట.. యూరోపియన్ శైలిలో ఆడేందుకు ప్రయత్నించింది. డెన్మార్క్ జోడీ కిమ్ ఆస్ట్రప్-ఆండెర్స్ స్కారప్పై ఓటమిని చవిచూసింది.
"మేము కొత్త తరహా శైలి ఆడటానికి ప్రయత్నిస్తున్నాం. మేం ఉత్తమంగా ఆడకపోవచ్చు. కానీ, గత టోర్నీలో వ్యూహాత్మకంగా, విభిన్నంగా గేమ్‌ను అమలుపరిచాం. టోక్యోలో మెడల్ గెలవాలంటే ప్లాన్-బీతో మేము ఆడాల్సిందే. కొత్త కోచ్ కింద ఆడనుండటం, కొత్త తరహా ప్రణాళికను అమలు చేయడం ఎప్పటికైనా సవాలే. మేము అన్ని తరహా కోణాల్లో ఆడేటంత నైపుణ్యాన్ని సాధించాం. చిన్న చిన్న తప్పిదాలను సరిదిద్దుకుంటే మేము ఇందులో విజయవంతమవుతాం" అని చిరాగ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: స్వర్ణంతో మెరిసిన సరిత.. మరో ఇద్దరికి కాంస్యాలు
అభిమానులు లేకపోవడం లోటే..
కొత్త కోచ్ పట్ల మరో ఆటగాడు రాంకీ రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు. "గతంలో చాలా మంది ఆసియా కోచ్‌లు ఉన్నప్పటికీ.. తమ ఆటతీరును మార్చడానికి చాలా ఇబ్బందిగా ఉండేదని తెలిపాడు. ప్రస్తుత కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ బాగుందని వెల్లడించాడు. ఇప్పుడు యూరోపియన్ శైలి ఆటతీరు తమ దగ్గర ఉందని" పేర్కొన్నాడు.
మే 11 నుంచి 16 వరకు భారత్ వేదికగా జరగనున్న ఇండియా ఓపెన్‌లో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు నిర్వాహకులు. అయితే అభిమానులు లేకుండా మ్యాచ్‌లు ఆడటం కష్టమని రాంకీ రెడ్డి అభిప్రాయపడ్డాడు. 'కుటుంబ సభ్యులు, అభిమానులు వచ్చి మద్దతు ఇస్తారని భావించాం. కానీ, భారత్‌లో కరోనా రెండో వేవ్ పరిస్థితుల్లో బయో బబుల్‌లోనే ఆడటం ఉత్తమం' అని పేర్కొన్నాడు.
ఇటీవల కొవిడ్ తప్పుడు నివేదికల నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌కు ముందే వ్యాక్సినేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఈ ద్వయం వెల్లడించింది.
ఇదీ చదవండి: మ్యాచ్‌పై ఆశల్లేవు.. డెత్ ఓవర్లే కొంప ముంచాయి