టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీ ఇండియా ఓపెన్ సూపర్ 500 వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్ విశృంఖలంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్టు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. మే 11 నుంచి 16 వరకు దిల్లీలో జరగాల్సిన ఈ టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది.
ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నీని వాయిదా వేయడం మినహా తమకు మరో మార్గం లేదని బాయ్ ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపారు. వర్చువల్ పద్ధతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, దిల్లీ ప్రభుత్వం, ఇతర వాటాదారులతో పలురౌండ్ల చర్చలు తర్వాత ఆటగాళ్లు, బాయ్ అధికారుల భద్రత దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
33 దేశాల నుంచి 228 మంది క్రీడాకారుల ఎంట్రీలను ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్, ప్రపంచ నంబర్ వన్ మొమొట బరిలో దిగుతున్నట్టు కూడా గతంలో బాయ్ తెలిపింది. స్టార్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ సహా భారత్ నుంచి 48మంది బరిలో ఉన్నారు. అయితే, మళ్లీ ఈ టోర్నీని ఎప్పుడు నిర్వహించేది మాత్రం బాయ్ వెల్లడించలేదు.