India Open 2022 BWF: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి జోరుమీదున్నాడు భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్. అయితే ఛాంపియన్షిప్ ఫైనల్లో తనను ఓడించిన కీన్ యూపై(సింగపూర్) ప్రతీకారం తీర్చుకునే అవకాశం అతడికి వచ్చింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న యోనెక్స్ సన్రైస్ ఇండియా ఓపెన్ టోర్నీలో వీరిద్దరూ మళ్లీ తలపడబోతున్నారు. ఈ టోర్నీలో సిరిల్ వర్మతో తన తొలి మ్యాచ్‌ను మొదలుపెట్టనున్న అతడు.. సెమీఫైనల్లో కీన్‌ను ఢీ కొననున్నాడు.
ఈ టోర్నీ సూపర్ 500 ఈవెంట్లో స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు సులవైన డ్రా ఎదురైంది. ఈజిప్ట్‌కు చెందిన అధమ్తో(Adham Elgamal) తన తొలి మ్యాచ్‌ను ఆడనున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో హెచ్ ఎస్ ప్రణయ్‌తో తలపడనున్నాడు. ప్రణయ్.. పాబ్లో ఏబియన్తో(Spaniard Pablo Abian) తన మ్యాచ్‌లు మొదలుపెట్టనున్నాడు.
రెండో సీడ్ బి.సాయి ప్రణీత్‌కు కఠిన డ్రా ఎదురైంది. ఓపెనింగ్ రౌండ్లో లూయిస్ పెనాల్వర్తో(Luis Penalver) క్వార్టర్ ఫైనల్స్‌లో ఇండినేషియా ప్లేయర్ టామీను(Tommy Sugiarto) ఢీ కొననున్నాడు.
మహిళల సింగిల్స్
స్టార్ షట్లర్స్ పీవీ సింధుకు సులువైన డ్రా లభించింది. సింధు తన తొలి మ్యాచ్‌ను శ్రీ కృష్ణ ప్రియ కుదరవల్లితో ప్రారంభించగా.. లాస్ట్-8 స్టేజీలో రష్యా ఐదో సీడ్ జెనియాతో(Evgeniya Kosetskaya) తలపడనుంది.
గాయాలతో సతమతమవుతున్న సైనా నెహ్వాల్‌కు మాత్రం కఠిన డ్రా పడింది. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ ఇరిష్ వాంగ్‌తో(యూఎస్ఏ), సెమీఫైనల్లో రెండో సీడ్ బుసనన్తో(Busanan Ongbamrungphan) పోటీ పడనుంది.
పురుషుల, మహిళల డబుల్స్
పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి.. రవి-చిరాగ్ అరోరా ద్వయంతో మ్యాచ్‌ను ప్రారంభించగా.. లాస్ట్-4 స్టేజీలో ఇంగ్లాడ్‌కు చెందిన నాలుగో సీడ్ బెన్ లేన్-సీన్ వెండీ జోడీతో తలపడొచ్చు.
మహిళల డబుల్స్‌లో రెండో సీడ్ ద్వయం అశ్విని పొన్నప్ప-ఎన్ సిక్కీ రెడ్డీకి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునేందుకు సులుడైన డ్రా లభించింది. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో ఓపెనింగ్ రౌండ్లో బి సుమిత్ రెడ్డి-పొన్నప్ప జోడీకి మాత్రం కాస్త కష్టమైన డ్రా అనే చెప్పాలి. ఈ జోడీ రెండో సీడ్ రష్యా ద్వయం రొడియోన్-అలీనాతో(Rodion Alimov-Alina Davletova) పోటీ పడనున్నారు.
ఈ టోర్నీ దిల్లీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16వరకు జరగనున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: kidambi srikanth BWF: ఫైనల్లో ఓడినా చరిత్రే