ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నుంచి అలవర్చుకున్నానని టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పసిడి పతక విజేత ప్రమోద్ భగత్ తెలిపాడు (pramod bhagat sachin). తాను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, అప్పటి నుంచే టీవీలో సచిన్ ఆటను చూసేవాడినని అన్నాడు. దాంతో తనకు కూడా అతడిలా ప్రశాంతంగా ఉండే లక్షణం అలవడిందని పేర్కొన్నాడు. మైదానంలో సచిన్ ఒత్తిడి జయిస్తూ ప్రశాంతంగా ఆడేవాడని గుర్తుచేశాడు.
"నేను చిన్నప్పటి నుంచే సచిన్‌ను ఫాలో అయ్యేవాడిని. అతడి ప్రవర్తన నన్ను అమితంగా ఆకట్టుకుంది. నేను కూడా అలాంటి ఆలోచనా విధానంతోనే ఆడేవాడిని. అలా ప్రశాంతంగా ఉంటూ ఆటపై శ్రద్ధ పెట్టడం నాకెంతో ఉపయోగపడింది. ఎన్నో మ్యాచ్‌ల్లో వెనుకపడిపోయాక తిరిగి పుంజుకోవడంలోనూ బాగా కలిసివచ్చింది. పారాలింపిక్స్ ఫైనల్స్‌లో నేను 4-12 తేడాతో వెనుకంజలో ఉన్నప్పుడు కూడా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నా. ప్రశాంతంగా ఆడితే మళ్లీ పుంజుకొని విజయం సాధిస్తానని భావించా"
- ప్రమోద్ భగత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
ఇక పారాలింపిక్స్‌లో పసిడిపతకం సాధించిన అనంతరం సచిన్‌ను కలిశానని, దాంతో తన ఆరాధ్య క్రికెటర్‌ను కలవాలనే కోరిక నెరవేరిందని ప్రమోద్ పేర్కొన్నాడు. జీవితాన్ని, క్రీడలను ఎలా సమన్వయం చేసుకోవాలో సచిన్ తనకు చెప్పారని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన టీ షర్టు బహుమతిగా ఇచ్చాడని తెలిపాడు. ఇక 2005లో తాను బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించినప్పుడు ఈ ఆటకు భవిష్యత్ లేదని భావించానని చెప్పాడు. అనంతరం 2009లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచానని, ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ పారా బ్యాడ్మింటన్‌ను గుర్తించాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు తాను పసిడి పతకం సాధిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని ఆశించినట్లు తెలిపాడు. అయితే, తాను ఊహించినదానికన్నా మంచి గుర్తింపు లభించిందని ప్రమోద్ సంతోషం వ్యక్తంచేశాడు.
ఇదీ చూడండి: పారాలింపిక్స్ విజేతలతో మోదీ సమావేశం.. వీడియో రిలీజ్