డబ్బు సంపాదించడం కంటే పతకాలు సాధించడానికే తన మొదటి ప్రాధాన్యమని చెప్పింది ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు. ఫోర్బ్స్ జాబితాలో తన పేరు ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఇతర అథ్లెట్లలా కాకుండా వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనడం తనకు చాలా ఇష్టమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
"ఫోర్బ్స్ జాబితాలో నా పేరు చూసుకోవడం చాలా సంతోషం అనిపించింది. క్రీడా దిగ్గజాలతో కలిసి జాబితాలో స్థానం దక్కించుకోవడం నాకు ఓ విధమైన ప్రేరణగా నిలిచింది. బ్యాడ్మింటన్తో పాటు షూటింగ్లకు వెళ్లడమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది ప్రత్యేకంగా ఉంటుంది. అయితే డబ్బు కంటే పతకాలు సాధించడానికే తొలి ప్రాధాన్యమిస్తాను"
-పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్
ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న క్రీడాకారిణుల్లో ఒకరిగా నిలిచింది. గతేడాది రూ.41.23 కోట్లు ఆర్జించి ఫోర్బ్స్ మహిళా అథ్లెట్ల జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకుంది. 2018 బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ గెలవడం సహా 2019లో ఇదే టోర్నీలో ఫైనల్స్ వరకు వెళ్లడం ఆమె సంపద గణనీయంగా పెరగడానికి కారణమైంది.
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న పీవీ సింధు తండ్రి రామన్న మాట్లాడుతూ.. "ఎన్ని పతకాలు సాధించినా, ఎంత డబ్బు సంపాదించిన మనం ఎక్కడి నుంచి వచ్చామన్న మూలాలను మర్చిపోకూడదు" అని తెలిపారు.