చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత్ ప్రయాణం ముగిసింది. ఇప్పటికే స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ నిష్క్రమించగా.. తాజాగా సాయి ప్రణీత్ ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన రెండోరౌండ్లో డెన్మార్క్‌కు చెందిన ఆండెర్స్ ఆంటొన్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 20-22, 22-20, 16-21 తేడాతో ఓడిపోయాడు ప్రణీత్. నువ్వా, నేనా అంటూ సాగిన తొలి గేమ్‌లో ప్రత్యర్థి గెలవగా.. రెండో సెట్లో విజయం ప్రణీత్‌ను వరించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో తీవ్రంగా పోరాడినప్పటికీ ఆండెర్స్ వ్యూహాల ముందు ప్రణీత్ నిలువలేకపోయాడు. ఫలితంగా మ్యాచ్ చేజార్చుకున్నాడు.
తొలి రౌండ్లోనే భారత సింగిల్స్ షట్లర్లు ప్రణయ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు టోర్నీ నుంచి వెనుదిరిగారు. గురువారం ఉదయం జరిగిన రెండో రౌండ్లో పారుపల్లి కశ్యప్.. 13-21, 19-21 తేడాతో ఓడిపోయాడు. డెన్మార్క్‌కు చెందిన విక్టర్ చేతిలో పరాజయం చెందాడు.
గురువారం జరిగిన రెండో రౌండ్లో డబుల్స్‌లో మిక్స్డ్ జోడీ సాత్విక్ - అశ్విని పొన్నప్ప ఓడారు. కొరియా ద్వయం సియో సియాంగ్ - చే యుజంగ్ చేతిలో పరాజయం చెంది నిష్క్రమించారు.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీని అధిగమించిన స్మృతి మంధాన