అర్జున అవార్డుకు ఎంపికైనందుకు ఆనందంగా ఉందని తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ చెప్పాడు. తనతో పాటు భాగస్వామి చిరాగ్‌శెట్టి పేరును అవార్డుకు సిఫారసు చేయడం వల్ల ఆనందం రెట్టింపు అయిందని అన్నాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపైనే ఇక తాము దృష్టి సారిస్తామని అంటున్న సాత్విక్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.
ఊహించలేదు..
తొలి ప్రయత్నంలోనే అర్జున అవార్డుకు ఎంపిక అవుతానని ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. నా భాగస్వామి చిరాగ్‌శెట్టి కూడా ఈ జాబితాలో ఉండడం సంతోషాన్ని రెట్టింపు చేసింది. డబుల్స్‌లో ఒకరికే అవార్డు వస్తుందని కొందరు అన్నారు కానీ అనూహ్యంగా ఇద్దరి పేర్లున్నాయి. త్వరలోనే మేము సాధన ఆరంభిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సింగిల్స్ షట్లర్లు సాధన మొదలుపెట్టారు. డబుల్స్ ఆటగాళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ తొలివారంలో ప్రాక్టీస్ మొదలవుతుందని అనుకుంటున్నా. చిరాగ్‌తో ఇప్పుడు చాలా మంచి సమన్వయం ఉంది. ఆరంభంలో ఇద్దరం భాష సమస్యను ఎదుర్కొన్నాం. నాది అమలాపురం.. అతనిది ముంబయి. దీంతో ఇబ్బంది పడేవాళ్లం. కానీ కోచ్ గోపీచంద్ మా మధ్య సమన్వయం వచ్చేలా చేశారు. ఇప్పుడు కోర్టులోనూ, కోర్టు బయట మా బంధం బలపడింది.
పతకం కోసమే..
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే కాదు పతకం తీసుకు రావడం మా ప్రధాన లక్ష్యం. అందుకు తీవ్రంగా శ్రమించక తప్పదు. డబుల్స్‌లో పోటీ తీవ్రంగా ఉంటుంది. అండర్-19 నుంచి కుర్రాళ్లు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా చైనా, ఇండోనేషియా నుంచి పోటీ ఎక్కువ. ఇప్పుడు ఒక స్థాయికి రావడం వల్ల మాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇది ఇంకా ఒత్తిడిని పెంచుతుంది. ముఖ్యంగా జూనియర్స్‌తో ఆడడం సవాల్. ప్రత్యర్థిని బట్టి కాకుండా మన ఆటను మెరుగుపరుచుకోడంపైనే ఎదుగుదల ఉంటుంది. వీటన్నిటిని తట్టుకుని నెగ్గుకు రావాల్సి ఉంటుంది. సింగిల్స్‌తో పోలిస్తే డబుల్స్‌లో వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. అంతేకాదు డబుల్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా ఒకే స్థాయిలో ఉండాలి. సమన్వయంతో కోర్టులో కదలాలి. గాయాలు కాకుండా చూసుకోవాలి. సింగిల్స్‌లో గాయమైనా మళ్లీ కోలుకుని ఆడేందుకు అవకాశం ఉంటుంది. డబుల్స్‌లో ఒక ఆటగాడికి గాయమైతే అతని భాగస్వామి కూడా ఆగిపోవాల్సి ఉంటుంది. అంతేకాదు ర్యాంకింగ్‌ను నిలబెట్టుకుంటూ.. స్థిరంగా ముందుకు వెళ్లడమూ కష్టమైన విషయమే.