భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ ఒలింపిక్స్ బెర్త్‌పై కన్నేసింది. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ పోటీల్లో మంచి ప్రదర్శనలతో ఆకట్టుకున్న దీప... టోక్యో క్రీడలపై గురిపెట్టింది. గతేడాది నవంబరులో జర్మనీలో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్మాస్టిక్ ప్రపంచకప్‌లో కాంస్యం సాధించి ఒలింపిక్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
గత ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మోకాలి గాయంతో ఆటకు దూరమైంది దీప. తర్వాత పుంజుకుని జర్మనీ ప్రపంచకప్‌లో సత్తా చాటింది. ఫిబ్రవరిలో మెల్బోర్న్ ప్రపంచకప్ సీజన్లో పాల్గొనకపోయినా.. బకు(అజార్బైజాన్), దోహ(ఖతర్)లో జరిగే వరల్డ్ కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది.
"ప్రపంచకప్ పోటీల్లో సత్తా చాటి 2020 ఒలింపిక్స్ అర్హత అవకాశాలను మెరుగుపరచుకుంటాను. గత ఏడాది జర్మనీలో కాంస్యం గెలవడంతో నాలో ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది"
-- దీపాకర్మాకర్, భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి
బకులో ఈ నెల 14 నుంచి 17 వరకు జిమ్నాస్టిక్ ప్రపంచకప్ జరగనుంది. దోహలో ఈ నెల 20 నుంచి 23 వరకు టోర్నీ నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది వివిధ చోట్ల జిమ్నాస్టిక్ ప్రపంచకప్ నిర్వహిస్తుంది అంతర్జాతీయ జిమ్నాస్టిక్ ఫెడరేషన్(ఎఫ్ఐజీ). ఈ పోటీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారిని ఒలింపిక్స్‌లోని 8 రౌండ్ల అర్హత పోటీలకు ఎంపిక చేస్తారు.