లో దుస్తుల సైజ్ చెప్పాలంటూ!
ఇటీవల పూజాహెగ్డే, ప్రియమణి, శ్రీముఖి.. తదితర తారలకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. తాజాగా ప్రముఖ టీవీ నటి సాయంతనీ ఘోష్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మానసిక ఆరోగ్యం, సానుకూల దృక్పథం లాంటి విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుందామని ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన ఆమెను లో దుస్తుల సైజ్ చెప్పాలంటూ ఇబ్బంది పెట్టాడు ఓ నెటిజన్. ఈ సందర్భంగా అతడికి తనదైన శైలిలో సమాధానం చెప్పిన ఆమె ఆ తర్వాత బాడీ షేమింగ్‌కు సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
వెండి తెర నుంచి బుల్లి తెరకు..
సాధారణంగా ఎవరైనా మొదట సీరియల్స్‌లో నటించి సినిమాల్లోకి వెళతారు. కానీ సాయంతనీ మొదట బెంగాలీ సినిమాల్లో నటించి ఆ తర్వాతనే బుల్లితెరకు పరిచయమైంది. మోడల్‌గా ‘మిస్ కలకత్తా’ కిరీటం సొంతం చేసుకున్న ఆమె ‘కుంకుమ్: ఏక్ ప్యార్ సా బంధన్’ సీరియల్‌తో మొదటిసారిగా స్మాల్ స్ర్కీన్‌పై దర్శనమిచ్చింది. ‘ఘర్ కా సప్నా’, ‘రక్త్ సంబంధ్’, ‘ససురాల్ సిమర్ కా’, ‘నాగిన్’, ‘మహా భారత్’, ‘నామ్‌కరణ్’ ‘బారిష్టర్ బాబు’... తదితర సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ‘కామెడీ సర్కస్’, ‘బిగ్ బాస్’, ‘నచ్ బలియే’, ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ వంటి టీవీ రియాలిటీ షోల్లో పాల్గొని సత్తా చాటింది. ఇక సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ అందాల తార నిత్యం తన అందమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాదు సందర్భం వచ్చినప్పుడల్లా సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది.
ఎందుకు అలా వెకిలిగా మాట్లాడతారో?
తాజాగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్‌స్టా లైవ్ ద్వారా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించిందీ అందాల తార. ఈ సందర్భంగా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు సానుకూల దృక్పథం...తదితర అంశాలపై చర్చిస్తుండగానే ఓ నెటిజన్ లో దుస్తుల సైజ్ చెప్పమంటూ తన వంకర బుద్ధిని చాటుకున్నాడు. దీంతో తనదైన శైలిలో అతడికి జవాబిచ్చిందీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్.
‘వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నా అభిమానులతో మాట్లాడుతుండగా ఒకడు నా లో దుస్తుల సైజ్ గురించి అడిగాడు. దీంతో అతడికి నా శైలిలో తగిన సమాధానం ఇచ్చాను. మీలో చాలామంది నా జవాబును మెచ్చుకున్నారు కూడా. అయినా బాడీ షేమింగ్, దానిని ఎదుర్కోవడం గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరముందని నేను భావిస్తున్నాను. గతంలోనూ నేను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను. కొందరు నా ఛాతీ వైపు తదేకంగా చూస్తున్నప్పుడు నేను తీవ్ర అసౌకర్యానికి గురయ్యాను. శరీరంలో ఇతర అవయవాల మాదిరిగానే ఇవి కూడా ఓ భాగమే కదా. మరి అలాంటప్పుడు సైజులు అంటూ ఎందుకు వెకిలిగా మాట్లాడుతున్నారు?’
- సాయంతనీ ఘోష్
మనల్ని మనం ప్రేమించుకోవాల్సిన అవసరమొచ్చింది!
‘ఇక మన అమ్మాయిల్లో కూడా చాలామంది తమ శరీరాకృతిని చూసి ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నారు. మరికొందరు తమకు సరైన శరీరాకృతి లేదంటూ ఇంప్లాంట్ సర్జరీలను, బ్రెస్ట్ రిడక్షన్ ప్రక్రియలను ఆశ్రయిస్తున్నారు. ఇక చాలు... ఇకనైనా మనం సైజుల గురించి మాట్లాడుకోవడం మానేయాలి. మనల్ని మనం ప్రేమించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మన శరీరం ఎలా ఉన్నా దాన్ని అంగీకరించాల్సిందే. మన శరీరాకృతి గురించి హేళన చేస్తూ ఎవరైనా మనల్ని బాధ పెట్టాలని చూస్తే వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. అసలు మన శరీరం గురించి మాట్లాడే హక్కు మగవారికి ఎవరిచ్చారు?
ఇక ఇప్పుడు నా లో దుస్తుల సైజు గురించి మాట్లాడిన వాడిని చూస్తుంటే నాకొక విషయం అర్థమవుతోంది. అతడికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమని నేను భావిస్తున్నాను. అతడు అడిగినట్లే మనం కూడా మగవారిని చాలా విషయాలు అడగవచ్చు. అప్పుడు వారి పరిస్థితేంటి? సైజుల గురించి అడిగే ఇలాంటి వారివల్లే అభద్రతా భావంతో ముఖానికి మాస్కులు వేసుకుని తిరగాల్సి వస్తోంది. అందుకే ఇక నైనా ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం మానేద్దాం. మీ శరీరంతో పాటు మీ మనసుని కూడా ఫిట్ గా ఉంచుకోండి.. శరీరాకృతి గురించి బాధ పడడం మానెయ్యండి.. నేను చెప్పింది మీ అందరికీ సమ్మతం అయితే లవ్ సింబల్‌తో కామెంట్ చేయండి’ అంటూ స్ఫూర్తిదాయక మాటలు రాసుకొచ్చిందీ బుల్లితెర నటి.
అసభ్యకర కామెంట్లు, వెకిలి ప్రశ్నలతో వేధించే కొందరు నెటిజన్లకు బుద్ధి చెప్పేలా సాయంతనీ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. బుల్లితెర సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: కరోనా కమ్ముకొస్తున్నా అదే నిర్లక్ష్యం