తెరపై హీరోకి ఎన్ని సవాళ్లు ఎదురవుతుంటాయో, సినిమా పరిశ్రమ కూడా అన్నే సవాళ్లు ఎదుర్కొంటోంది. మొదట టీవీ, ఆ తర్వాత ఓటీటీ నుంచి పోటీ ఎదురైంది. మరోపక్క అదుపు తప్పిన నిర్మాణ వ్యయం, వాతావరణ పరిస్థితులు... ఇలా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో సంక్షోభాలు. అన్నింటినీ అధిగమిస్తూ వచ్చింది సినిమా. ఎప్పటికప్పుడు తన స్థాయిని పెంచుకుంటూ వెళుతోంది. అలాంటి సినిమా కరోనాతో వచ్చిన సంక్షోభంతో ఒక్కసారిగా కుదేలైపోయింది. కరోనాతో తొలి దెబ్బ పడింది సినిమాపైనే. మొదట థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత చిత్రీకరణలు ఆగిపోయాయి. క్రమంగా యావత్ చిత్రసీమ ఉపాధిని కోల్పోయింది. కొత్త సినిమాల ప్రారంభాలు, విడుదలలు, వేడుకలు, చిత్రీకరణలు... ఇలా ఎంతో సందడిగా కనిపించే చిత్రసీమ ఒక్కసారిగా తన కళని కోల్పోయింది.
ఉపాధి పోయి... నష్టం మిగిలి
లాక్‌డౌన్ తర్వాత వెంటనే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. చిత్రీకరణలు ఎప్పుడు మొదలవుతాయో, ఎలాంటి నిబంధనల మధ్య పని చేయాల్సి వస్తుందో తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 1800కిపైగా థియేటర్లలో ప్రదర్శనలు ఆగిపోవడంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు, వాటిపై ఆధారపడిన వ్యాపారులు ఉపాధిని కోల్పోయారు. యజమానులు, లీజుదారులు వాటి నిర్వహణ భారం భరించాల్సి వస్తోంది. నిర్మాతలు భారీ నష్టాల్ని మూటగట్టుకోవల్సి వస్తోంది. ఇప్పటికే సినిమాలపై పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పులు, వాటి వడ్డీ భారం నిర్మాతలకు గుదిబండగా మారాయి. వాటిని కొని బయానా ఇచ్చిన పంపిణీదారుల పెట్టుబడులు నిలిచిపోయాయి. ప్రదర్శనకారులు, పంపిణీదారులు, నిర్మాతలు, దర్శకులు... ఇలా అందరినీ కష్టనష్టాలు చుట్టుముట్టాయి. ''20 వేల మంది ఆధారపడిన తెలుగు చిత్రసీమకి ఇప్పటికే చాలా నష్టం జరిగింది. అదెంతనేది ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని'' చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ చెబుతున్నారు.
విడుదల చేసుకోవాలా వద్దా?
చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించినా ప్రేక్షకులకు వినోదానికి లోటు లేదంటే కారణం డిజిటల్ వేదికలే. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ 5, ఆహా తదితర ఓటీటీ ఛానళ్లు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఇప్పుడు కొత్త సినిమాలను విడుదల చేసుకోవడానికీ ఓ ప్రత్యామ్నాయంగా మారాయి ఈ డిజిటల్ వేదికలు. నిర్మాతల పెట్టుబడికి దీటుగానే వెచ్చించి హక్కులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కానీ థియేటర్లలో విడుదల చేసుకుంటే వచ్చే స్థాయిలో ఈ మాధ్యమాల ద్వారా లాభాలు రావని కొంతమంది, లాక్‌డౌన్ పూర్తయ్యేవరకు వేచి చూద్దామని ఇంకొంతమంది నిర్మాతలు తమ సినిమాల్ని అట్టి పెట్టుకున్నారు. ఇప్పటి వరకైతే నిర్మాతలంతా తమ సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసుకోవడంపైనే మొగ్గు చూపుతున్నారు. అయితే కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవనే సంకేతాలు, థియేటర్లు తొందరగా తెరుస్తారో లేదో అనే సందేహాలు వాళ్లని పునరాలోచనలో పడేస్తున్నాయి. వి, నిశ్శబ్దం, 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?, ఉప్పెన, రెడ్, అరణ్య... ఈ చిత్రాలన్నీ విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అయితే కొంతమంది కథానాయకులు డిజిటల్ మాధ్యమాల్లో విడుదలకి ఒప్పుకోవడం లేదని సమాచారం. కరోనా ప్రభావం తగ్గకపోతే డిజిటల్ మాధ్యమాల్లో విడుదల చేయడం తప్ప మరో దారి కనిపించడం లేదు. ఈ పరిణామాలను యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కరోనా తర్వాత సినీ పరిశ్రమలో పరిస్థితులు మారిపోతాయి కాబట్టి, అప్పుడు తీసుకోవల్సిన నిర్ణయాలపై గిల్డ్ సమాలోచనలు జరుపుతోంది.
చిన్న చిన్న సమస్యలొచ్చినా..
''నా ఉద్దేశంలో డిసెంబరు, జనవరికి కానీ థియేటర్లు ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కరోనాకి వెంటనే మందు వచ్చినా అందరూ ధైర్యం చేసి గుంపులుగా కలవడానికి మరో ఆర్నెళ్లు పడుతుంది. థియేటర్లు, షాపింగ్ మాల్స్, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు.. ఇలా గుంపులుగా కలిసే ప్రదేశాలు ప్రమాదకరమనే అభిప్రాయం ప్రజల మనసుల్లో ఉండిపోతుంది. అన్నిటికంటే చివరిగా థియేటర్లు ప్రారంభమవుతాయి. చిన్న సినిమాలకి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటికే విడుదలకి సిద్ధమైన సినిమాలు ఇంకొంతకాలం వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఓటీటీ వేదికలు సినిమాలకి అయినంత వ్యయాన్ని ఇచ్చి కొనలేవు. ఆ వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడం కోసం ఎదురు చూస్తే సినిమాని వడ్డీలు తినేస్తాయి. వడ్డీల్ని తట్టుకోగలిగిన ప్రాజెక్టులే నెట్టుకొస్తాయి. మొత్తంగా పరిశ్రమ చాలా సంక్షోభంలోకి వెళ్లబోతోంది. సాధారణ పరిస్థితులు రావడానికి రెండున్నరేళ్లు పడుతుంది. పరిశ్రమని వడ్డీలు తినేయకుండా, ప్రాజెక్టులు కుంగిపోకుండా ఫైనాన్షియర్లు, బ్యాంకర్లు చూడాల్సిన అవసరం ఉంది. కరోనా వల్ల వినోదాన్ని స్వీకరించే విధానంలో, ప్రేక్షకుడి అలవాట్లలో పెనుమార్పు వస్తుంది. ప్రేక్షకుడు వినోదాన్ని ఇంటినుంచే ఆస్వాదిస్తున్నాడు. భవిష్యత్తులో ఓటీటీ వేదికల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.''
- అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత
అప్పటి వరకు ఆగుతాం..
''చిత్ర పరిశ్రమ ఇదివరకెప్పుడూ చూడని సంక్షోభం ఇది. పరిస్థితుల్ని బట్టే నిర్ణయాలు తీసుకోవాలి. మే చివరికి గానీ ఏం చేయాలనే విషయంపై స్పష్టత రాదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్నిబట్టే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఈ విషయంలో మా ప్రొడ్యూసర్స్ గిల్డ్ బాగా పనిచేస్తోంది. రేపు పరిశ్రమపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎలా తట్టుకోవాలనే విషయంపై నిర్మాతలంతా మాట్లాడుకుంటున్నాం. విడుదలకి సిద్ధమైన సినిమాల్ని ఓటీటీ సంస్థలు కొనేందుకు ముందుకొస్తున్నాయి కానీ, ఆర్థికంగా నిర్మాతకి ఎంత వరకు మేలు జరుగుతుందనేది కూడా చూసుకోవాలి కదా. నష్టానికి ఓటీటీకి అమ్ముకుని సినిమాని విడుదల చేసుకోవాలని ఏ నిర్మాతా అనుకోడు. థియేటర్లు ప్రారంభమయ్యే వరకు ఆగుతాం. అప్పటి వరకు వడ్డీల భారం మోయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఫైనాన్షియర్లు కూడా సహకరిస్తారు. ఎప్పుడైనా సినిమాను ఆస్వాదించడంలో థియేటర్ అనుభవం వేరు. మా ‘వి’ సినిమా విషయంలో ఆలోచించింది అదే. ఆ సౌండ్, విజువల్స్ థియేటర్లలో గొప్ప అనుభూతినిస్తాయి. థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు ఎగబడి వస్తారు. మనకు వినోదం అంటే సినిమానే కదా. ఓటీటీల్లో సినిమాల విడుదలపై హీరోల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయనేది అవాస్తవం. ఆర్నెళ్ల కంటే ఎక్కువ రోజులు ఆగితే కొన్ని సినిమాలు పాతబడే ప్రమాదం ఉంటుంది. ఆర్నెళ్లకి కూడా థియేటర్లు ప్రారంభం కాకపోతే అప్పుడేం చేస్తాం? అందుకే హీరోలు కూడా వాళ్ల సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావడమే ముఖ్యం అనుకుంటారు. అది థియేటర్లలోనా, ఓటీటీల్లోనా అనేది ముఖ్యం కాదు.''
- దిల్‌రాజు, ప్రముఖ నిర్మాత, యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు