ఫిబ్రవరి 14న ఉభయ రాష్ట్రాల్లో ఎలాంటి టెలివిజన్ షూటింగ్‌లు జరగవని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఆదివారం జరగనున్న సభ వివరాలు తెలియజేసేందుకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేశ్ కుమార్ చేతుల మీదుగా ఫెడరేషన్ సభ్యులు సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 14న షూటింగ్‌ల నిలిపివేతకు ఛానళ్లు, తెలుగు టెలివిజన్ నిర్మాతల మండలి అంగీకరించినట్లు సురేశ్‌కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరవుతారని వెల్లడించారు. తెలుగు టెలివిజన్ ప్రభుత్వానికి రూ. 1,800 కోట్ల మేర ఆదాయం ఇస్తుంటే... కనీసం 10 శాతం కూడా సంక్షేమంపై ఖర్చు చేయటం లేదన్నారు.
టీవీని పరిశ్రమగా గుర్తించాలని, హైదరాబాద్ కేంద్రంగా కార్మికుల కోసం టీవీనగర్, టీవీభవన్ నిర్మించాలన్న డిమాండ్‌తో సభ నిర్వహిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్, బీమా, కల్యాణ లక్ష్మి, ఇతర ప్రభుత్వ పథకాలను టీవీ కార్మికులకు వర్తించాలని కోరారు.