బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రధానపాత్రలో నటించిన 'తాండవ్' మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను నిలిపివేయాలంటూ నిరసనలు వెల్లువెత్తడం సహా దర్శకనిర్మాతలు, నటులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వెబ్‌సిరీస్ వల్ల మనోభావాలు దెబ్బతిన్నవాళ్లకు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ క్షమాపణలు చెప్పి వెనక్కి తగ్గారు. అంతేకాదు.. ఆ వెబ్‌సిరీస్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు.
"మన దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తాం. ఏ ఒక్క వ్యక్తి, కులం, మతం, జాతి లేదా మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం లేదా కించపరచడం మా ఉద్దేశం కాదు. ఏదైనా సంస్థ, రాజకీయ పార్టీని అవమానించాలన్న ఆలోచన కూడా మాకు లేదు. 'తాండవ్'లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో మాకు మద్దతు ఇచ్చినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ధన్యవాదాలు. ఈ సిరీస్ ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే మేము మరోసారి క్షమాపణలు కోరుతున్నాం."
- అలీ అబ్బాస్ జాఫర్, 'తాండవ్' దర్శకుడు
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన 'తాండవ్' జనవరి 15న డిజిటల్ ప్లాట్‌ఫాంపై విడుదలైంది. ఈ వెబ్‌సిరీస్‌లో తమ మతాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇంటర్నెట్‌లో 'బాయ్‌కాట్ తాండవ్', 'బ్యాన్‌తాండవ్' పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి, భాజపా ఎంపీ, యూపీ భాజపా ఎమ్మెల్యేలు కొందరు 'తాండవ్'పై ఫిర్యాదులు చేయడం వల్ల యూనిట్ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో దర్శకుడు అలీ వెబ్‌సిరీస్‌లో మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: బాలీవుడ్లో క్రేజీ కాంబోలు.. హిట్ దక్కేనా?