మూడేళ్ల వయసులో పాట మొదలుపెట్టిన షణ్ముఖ ప్రియ దాన్నే తన ఆటగా మార్చుకుంది. మెలోడీ, మాస్, క్లాస్.. తేడా లేకుండా అన్ని వర్గాలనూ సుస్వరాలతో కట్టి పడేస్తుంది. అందుకే ఇండియన్ ఐడల్ వేదిక మీద ప్రశంసలతో పాటు అవకాశాలూ వెల్లువెత్తాయి. జయప్రద షణ్ముఖకు ఇష్టమైన సాంబారు అన్నాన్ని బాక్సులో తెచ్చి వేదికపైనే తినిపించి తన మమకారాన్ని చాటారు. మరో ప్రముఖ నటి రేఖ 'అద్భుతంగా పాడావు' అంటూ ఆలింగనం చేసుకున్నారు. బప్పిలహరి, కవితా కృష్ణమూర్తి, ఏఆర్ రెహమాన్.. ఒకరేమిటి అందరితోనూ అదరహో అనిపించుకుంది. ఇప్పుడు షణ్ముఖ అభిమాన నటుడు విజయ్ దేవరకొండ ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. 'హైదరాబాద్ వచ్చీ రాగానే నన్ను కలవబోతున్నావు.. నా సినిమాకు పాటలు పాడబోతున్నావు' అని వీడియోలో చెప్పాడు.. ఇవి చాలదా ఆమె ప్రతిభ గురించి చెప్పడానికి!
యోడ్లింగ్ అంటే పాడుతూ మధ్యలో విచిత్ర శబ్దాలు చేయడం, కూనిరాగాలు తీయడం. ఇది ఆడపిల్లలకు ఒకింత కష్టమే అయినా.. హిందీ గాయకుడు కిశోర్ కుమార్‌ను చూసి సాధన చేసిందామె. ఆమె ప్రతిభను గుర్తించిన వాళ్లబ్బాయి అమిత్ షణ్ముఖను లేడీ కిశోర్ కుమార్‌గా వర్ణించడమే కాదు.. వాళ్ల నాన్నకిష్టమైన రబ్డీని తినిపించి ఆశీర్వదించారు. ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన గాయకులకు ఇచ్చే గోల్డైన్ మైకులు రెండింటిని అందుకున్నది మన షణ్ముఖే.
సంగీతమే ప్రాణం..
షణ్ముఖప్రియ అమ్మానాన్న శ్రీనివాస్, రత్నమాల సంగీత విద్వాంసులు. శ్రీనివాస్ వీణ, వయొలిన్, మాండొలిన్, గిటార్, కీబోర్డ్‌లను అద్భుతంగా వాయించగలరు. ఆయన పంచముఖి సంగీత అవధానం కూడా చేశారు. అమ్మ రత్నమాలకు గాత్రంలో మంచి పట్టుంది. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న షణ్ముఖ ఇండియన్ ఐడల్ షోలోనూ ఎన్నో ప్రయోగాలు చేసి అందరి మన్ననలు అందుకుంది. ఊహ తెలియని వయస్సులోనే అమ్మ చేతిలోని మైక్‌ను లాక్కొని కూనిరాగాలు తీసేది చిన్నారి షణ్ముఖ.
అలారం సౌండ్‌ను అచ్చంగా అలానే పలికిస్తోన్న కూతురి బలాన్ని గుర్తించారా అమ్మానాన్నలు. సంగీతంలో శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టారు. దీంతో నాలుగేళ్లకే విశేష ప్రతిభ కనబరిచింది. వీణ, గిటార్, వయొలిన్, కీబోర్డ్ తదితర వాయిద్యాలను వాయించడంలోనూ ఆమె దిట్ట. వెస్ట్రన్, యోడ్లింగ్, పాప్, రాక్, జాజ్, బ్లూస్, ఓపెరాటిక్, అరబిక్, స్పానిష్, యాడ్లిప్స్, వెస్ట్రన్ ఫ్యూజన్ తదితర ప్రక్రియల్లోనూ పట్టు సాధించింది.
స్టూడియోలే లోకం..
చిన్నప్పటి నుంచే పోటీల్లో విశేష ప్రతిభ చూపిన షణ్ముఖకు 2008 నుంచి స్టూడియోలే లోకమంటే అతిశయోక్తికాదు. ఇండియన్ ఐడల్ పోటీ ఆమెకు 12వ రియాల్టీ షో. ఇప్పటివరకు పాల్గొన్న వాటిల్లో ఆరింటిలో విజయం సాధించింది. 2013లో ఈటీవీ 'పాడుతా తీయగా' పోటీలో రన్నరప్ తను. ఓ తమిళ ఛానెల్ కార్యక్రమంలో తమిళ గాయకులతో పోటీపడి విజేతగా నిలిచింది. ఆ పోటీ కోసం షణ్ముఖ తమిళం నేర్చుకుంది. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిషుల్లోనూ అలవోకగా పాడగలదు. అంతర్జాతీయ గాయకుల ఆల్బమ్‌లను చూడటం తన అలవాటు. ఫలితంగా తనకూ అంతర్జాతీయ ప్రమాణాలతో పాడటం అలవాటైపోయింది.
చదువులోనూ మేటే!
షణ్ముఖప్రియ చదువులోనూ రాణిస్తోంది. పదిలో 9.5, ఇంటర్లో 9.7 స్కోరును సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన శ్రీచైతన్య విద్యాసంస్థలు మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా చదివించాయి. ఇప్పుడు బీఎస్సీ మొదటి సంవత్సరం శ్రీకాశ్యప్ కళాశాలలో చదువుతోంది. ఆ కళాశాల యాజమాన్యం ఆమెకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించింది.
మైఖేల్ జాక్సన్ పాడిన వేదికపై..
షణ్ముఖ లండన్‌లోని ప్రఖ్యాత 'ఒ2 ఆడిటోరియం'లో పాడింది. మైఖేల్ జాక్సన్ పాడిన ఆ ప్రతిష్ఠాత్మక వేదికపై అవకాశం పొందిన అతికొద్ది మందిలో తనూ ఒకరు. అమెరికా, హాలెండ్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఉత్తరకొరియా వంటి దేశాల్లోనూ పాడింది. అంతర్జాతీయ గాయనిగా ఎదగాలన్న తన ఆశయం ఎంతో దూరంలో లేదు.
- నా సినిమాలో షణ్ముఖకు ఓ పాట ఇవ్వాలనుకున్నా. తను పాడటం ప్రత్యక్షంగా చూశాక పాటలన్నీ తనతోనే పాడించాలి అనుకుంటున్నా. - ఒమంగ్ కుమార్, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత.
- నా తర్వాత సినిమాకు నువ్వే పాడుతున్నావ్. - శ్రద్ధాకపూర్, బాలీవుడ్ నటి.
- ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఆక్టోపస్ 'షణ్ముఖతో ఆల్బమ్‌కు ఒప్పందం కుదుర్చుకుంది.
- బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్, అతుల్‌లు తనతో కొన్ని పాటలు రికార్డు కూడా చేశారు. - బి.ఎస్.రామకృష్ణ, విశాఖపట్నం.
ఇదీ చూడండి.. 'ఇండియన్ ఐడల్' విజేతగా పవన్‌దీప్ రాజన్