సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ 'ఐడల్ సీజన్ 12' విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్ దనిష్, ఐదో స్థానంలో నిహల్, మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. ఎన్నో ఆశలతో ఫైనల్ పోరుకు చేరిన షణ్ముకప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్ విజేత పవన్‌దీప్ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు.
12 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ ఫైనల్ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది. గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్ షో అర్ధరాత్రి వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు తిలకించి ఉర్రూతలూగారు. మొదటినుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి ఫైనల్ బరిలో మన తెలుగుతేజం షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, నిహల్, సేలీ కంబ్లే, మహ్మద్ దనిష్ నిలిచారు. ఈ ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారని అందరూ ఊపిరిబిగబట్టుకొని చూశారు. చివరగా ఫైనల్ విజేతగా పవన్‌దీప్‌ను ప్రకటించడం వల్ల అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇండియన్ ఐడల్ 12 సీజన్‌కు ఆదిత్య నారాయణ్ హోస్ట్‌గా, హిమేశ్ రేష్మియా, అను మాలిక్, సోను కక్కర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గ్రాండ్ ఫినాలేకు జావెద్ అలీ, సుఖ్విందర్ సింగ్, రాఘవ్ సచార్, మికా సింగ్, సాధన సర్గమ్, అన్ను కపూర్, షేర్షా జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్ నారాయణ్, అల్కా యజ్ఞిక్, వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్ ఫేం గ్రేట్ కాళీ తదితరులు అతిథులుగా విచ్చేశారు. పలువురు గాయకులు పాటలతో ఫైనల్‌పోరులో ఉత్సాహం నింపారు.
నమ్మలేక పోతున్నా..
ఇండియన్ ఐడల్ 12 విజేతగా నిలిచిన అనంతరం పవన్‌దీప్ మాట్లాడుతూ.. "నేను టైటిల్ గెలిచానని నమ్మలేకపోతున్నాను. కలలో ఉన్నట్లు అనిపిస్తోంది. వాస్తవంలోకి రాలేకపోతున్నాను. ఇది నాకు లభించిన గొప్ప గౌరవం. నాకు ఓట్లేసి గెలిపించిన అభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. ఇండియన్ ఐడల్ పోటీలో నాతోపాటు కలిసి ప్రయాణించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. నన్ను విజేతగా తయారు చేసిన వారు, సంగీత కళాకారులు, నా గురువులు, సహ పోటీదారులందరిది ఈ ట్రోఫి. ఇండియన్ ఐడల్, దేశ ప్రజలకు ధన్యవాదాలు. విజేతగా నిలిచిన సందర్భం గొప్పగా ఉంది" అని పవన్ పేర్కొన్నాడు.
వ్యక్తిగతం
పవన్‌దీప్ రాజన్‌ది ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా. ఇండియన్ ఐడల్ 12లో మొదటి నుంచి బలమైన పోటీదారుగా ఉన్నాడు. 2015 పవన్‌దీప్ వాయిస్ ఇండియా షోలో విజేతగా నిలిచాడు. 2020 నవంబర్ 28న ప్రారంభమైన ఈ షో 9 నెలల పాటు సంగీత ప్రియులను అలరించింది.
ఇదీ చూడండి.. టాలీవుడ్లో లీకుల గోల.. ఎక్కడ తప్పు జరుగుతోంది?