తన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని తెలిసినా.. ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారని ఎస్పీ బాలు గురించి చెప్పుకొచ్చారు ఆయనకు చికిత్స చేసిన వైద్యుడు సురేశ్ రావు. ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కీలక విషయాలు వెల్లడించారు. బాలసుబ్రహ్మణ్యం గొప్ప వ్యక్తి అని కీర్తించిన ఎంజీఎం వైద్యుడు.. ఆయన మరణం ప్రపంచానికే లోటు అని విచారం వ్యక్తం చేశారు.
''ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా గొప్ప వ్యక్తి. చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరినపుడు చికిత్సకు ఎలా సహకరిస్తారో అని, ఇక్కడ ఎలా ప్రవరిస్తారో అని మేం చాలా కంగారుపడ్డాం. కాని ఆయన చాలా గొప్ప వ్యక్తి. వైద్యులు, నర్సులు, నిపుణులకు ఆయన చాలా సహకరించారు. మేం ఆయనకు ఏం చెప్పినా.. మీరు ఏది కావాల్సివస్తే అది చేయండి, నేను సహకరిస్తాను అని చెప్పేవారు. ప్రాణాధార వ్యవస్ధను అమర్చే సమయంలో కూడా ఆ విషయాన్ని ఆయనకు చెప్పగా, అది నిజంగా అవసరమైతే తప్పకుండా అమర్చండి అని అన్నారు. ప్రాణాధార వ్యవస్థ అమర్చిన తర్వాత కూడా ఆయన మేల్కొనే ఉన్నారు. అప్పుడు ఏమైనా నొప్పి కల్గుతోందా అని మేం అడిగితే.. ఆయన అవును నొప్పి కల్గుతోంది అని చెప్పేవారు. మేం ఆ వ్యవస్థను సరిదిద్దిన తర్వాత మళ్లీ నొప్పి కల్గుతోందా అని అడిగితే ఏమీ లేదని తెలిపేవారు. మీరు సౌకర్యంగా ఉన్నారా అని అడిగితే.. అవును సౌకర్యంగానే ఉన్నాను అని చెప్పేవారు. మా ఆసుపత్రిలో చికిత్స జరిగిన మొత్తం సమయంలో ఆయన సౌకర్యంగానే ఉన్నారు. చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది అందరినీ ఆయన ప్రోత్సహించేవారు. నేను మీకు సహకరిస్తాను. నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయండి అని అనే వారు.
ప్రాణాధార వ్యవస్థ మీద ఉన్నపుడు మాట్లాడడానికి వీలు కాదు. అప్పుడు బాలసుబ్రమణ్యం సైగల ద్వారా తాను చెప్పాల్సింది చెప్పేవారు. కొన్ని సార్లు ఆయన చెప్పింది మాకు అర్థం అయ్యేది కాదు. అప్పుడు ఆయన పెన్ను, కాగితం అడిగితే మేం.. ఇచ్చేవాళ్లం. అప్పుడు ఆయన వెంటిలేటర్ సరిగా లేదు, నాకు ఐస్‌క్రీమ్ కావాలి లాంటి మాటలు కాగితం మీద రాసేవారు. ఆంగ్లంలో ఆయన స్పష్టంగా రాసేవారు. మేం ఇంతకుముందు చాలా మంది రోగులను చూశాం. కాని వారు కాగితం మీద రాసింది అర్థం చేసుకోవడం మాకు కష్టమయ్యేది. కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రం స్పష్టమైన ఆంగ్లంలో రాసేవారు. రాసిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే.. కొట్టివేసి మళ్లీ రాసేవారు. అందువల్ల ఆసుపత్రిలో చికిత్స సమయంలో ఆయనతో వ్యవహరించడం చాలా సులభంగా ఉండేది. చికిత్స సమయంలో ఒక రోజు తనకు కాలక్షేపం కావడం లేదని, ఐపీఎల్ మ్యాచ్ చూడాలని ఉంది అని సంకేతం ఇచ్చారు. అప్పుడు మేం ఆయన కోసం ప్రత్యేకంగా టీవీ ఏర్పాటు చేశాం. అప్పుడు ఆయన ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించారు. కొన్ని పాటలు వినాలని ఉందని సంకేతం ఇస్తే వాటిని కూడా వినిపించాం. చివరి క్షణాల్లో ఆయన పరిస్థితి విషమించిన సమయంలో మేం చాలా బాధపడ్డాం. ఆయనను రక్షించేందుకు ఏమైనా చేయాలని భావించాం. దాని కోసం రోజంతా ఆలోచించాం. విదేశాల్లో ఉన్న ఇతర నిపుణులను సంప్రదించడం సహా బాలసుబ్రహ్మణ్యంను కాపాడేందుకు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గాలు అన్నింటినీ అనుసరించాం. అయినా చివరకు ఆయనను కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన మరణం దేశానికి, ప్రపంచానికి లోటు. బాలసుబ్రహ్మణ్యం గొప్ప పోరాట యోధులు. ఆయన ఆరోగ్య పరిస్ధితి క్షీణించిన సమయంలో చాలా ధైర్యాన్ని ప్రదర్శించారు. బాలసుబ్రహ్మణ్యంకు చికిత్స చేయడం మాకు దక్కిన గొప్ప గౌరవం.''
- డాక్టర్ కె.జి. సురేశ్ రావు, ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు