ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ సామాన్యుల నుంచి దేశాధ్యక్షుల వరకు ఎవర్నీ వదలడంలేదు. గ్రామీ పురస్కార గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ దేశీయ గాయకుడు జో డిఫ్ఫే కరోనా వైరస్‌తో మరణించాడు. కొవిడ్-19 కారణంగా ఆదివారం, జో మరణించాడని అతడి అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించారు. చనిపోవడానికి రెండు రోజుల క్రితమే తనకు కరోనా ఉన్నట్లు జో డిఫ్ఫే వెల్లడించాడు. ఈ సమయంలో తనతో సహా తన కుటుంబసభ్యులు ప్రత్యేకంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు, ముఖ్యంగా తన అభిమానులు అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తతో ఉండాలని గుర్తుచేస్తున్నామంటూ ప్రకటనలో పేర్కొన్నాడు.
అమెరికాలోని ఒక్లహామాకు చెందిన 61ఏళ్ల జో డిఫ్ఫే.. ఎన్నో ప్రసిద్ధ ఆల్బమ్‌లు రూపొందించాడు. ముఖ్యంగా 1990లో ఇతడి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 'పిక్‌అప్ మ్యాన్' వంటి పాటతో పాటు 'ఇఫ్ ది డెవిల్ డాన్స్‌డ్', 'హాంకీ టాంక్ యాటిట్యూడ్' వంటి ఆల్బమ్‌లు పేరుతెచ్చాయి. 1990లో అతడి మొదటి ఆల్బమ్ 'ఏ థౌజండ్ వైండింగ్ రోడ్స్' విడుదలవగా 'హోమ్' అనే పాట అత్యంత విజయవంతమైంది.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు అమెరికాలో నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా లక్షా 40 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, 2వేల మందికి పైగా మరణించారు.