ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల నటులు చాలా అరుదు. ఆ కోవకి చెందిన తెలుగు నటులే బెనర్జీ, జీవా. విలన్లుగా, క్యారక్టర్ ఆర్టిస్టులుగానే కాకుండా హాస్యనటులుగానూ అలరించి మెప్పించారు. సినిమాలో పుట్టి పెరిగిన కుటుంబం బెనర్జీది. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం జీవాది. అలాంటి ప్రత్యేకత కలిగిన వారిద్దరూ ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన మాటామంతీలో వారేమన్నారో చూద్దాం.
నమస్కారం బెనర్జీ అలియాస్ వేణు, జీవా అలియాస్ దయారత్నం. చిత్రసీమకు మీ ఇద్దరిలో మొదట వచ్చిందెవరు?
బెనర్జీ: జీవానే చిత్రసీమకు ముందు వచ్చారు.
మీరు చిత్రసీమలోకి ఎప్పుడు వచ్చారు?
జీవా: 'స్వర్గం నరకం' నా మొదటి చిత్రం. తొలుత ఈ సినిమాలో విలన్‌గా నాకు స్క్రీన్ టెస్ట్ చేశారు. 'ఇంటికెళ్లండి.. తర్వాత కబురు చేస్తాం' అన్నారు. కానీ, తర్వాత 'మీది స్టూడెంట్ పాత్ర, ఇందులో విలన్‌గా భక్తవత్సలం ఉంటార'న్నారు. కాస్త నిరాశకు గురయ్యా. అసలు ఈ మంచు భక్తవత్సలం(మోహన్‌బాబు) ఎవరా? అని చూద్దామని ఆఫీసుకు వెళ్లా. చూస్తే బొట్టు పెట్టుకుని బాగానే ఉన్నాడు. నాకంటే ఇతనే బెటర్ అనుకున్నా. అందరం కలిసి మద్రాసు నుంచి విజయవాడ బయలుదేరాం. ఆ తర్వాత కె.బాలచందర్ 'తొలికోడి కూసింది' అనే చిత్రంలో నటీనటుల కోసం ప్రకటన ఇచ్చారు. దానికి కానూరి రంజిత్ కుమార్ నిర్మాత. ఫొటో పంపిస్తే, సెలక్ట్ అయ్యానని టెలిగ్రామ్ పంపారు. అయినా, ఎక్కడో అనుమానం. ఇదే విషయాన్ని కొందరిని అడిగితే 'కె.బాలచందర్ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు' అని చెప్పారు. అలా నా ప్రయాణం మొదలైంది.
మీ కుమారుడికి బాలచందర్ పేరు పెట్టారట!
జీవా: (నవ్వుతూ) నన్ను అడిగితే అది చాలా తక్కువే. ఇంతకంటే ఆయనకు నేనేం ఇవ్వగలను. ఆయన పేరు పెట్టడం కోసం పర్మిషన్ కూడా అడిగా. అయితే ఆయన 'బాలచందర్ అంటే అర్థం తెలుసా' అన్నారు. నాకు తెలియదన్నా. మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పేరే పెడతా అని చెప్పా. ఆ తర్వాత కొంతమంది పండితుల్ని అడిగితే విఘ్నేశ్వరుడికి మరో పేరని చెప్పారు.
బెనర్జీ.. మీ సినీరంగ ప్రవేశం ఎప్పుడు?
బెనర్జీ: చిన్నప్పట్నుంచి సినీ పరిశ్రమలోనే ఉన్నా. హోటల్ మేనేజ్‌మెంట్ చేశా. చదువుకునేటప్పుడు నిర్మాతలు, హీరోల పిల్లలతో మద్రాసులోని ఆంధ్రాక్లబ్‌లో క్యారమ్ బోర్డు ఆడేవాడిని. అక్కడికి సినిమాలో నటించేవాళ్లు వచ్చేవారు. నేను నటించిన మొదటి చిత్రం 'హరిశ్చంద్రుడు'(1979). యు.విశ్వేశ్వరరావు దర్శకుడు, నిర్మాత. ఆయన ఎన్టీఆర్ వియ్యంకుడు. ఇందులో సావిత్రి, ప్రభాకర్‌రెడ్డి నటించారు. సావిత్రి నటించిన చివరి సినిమా ఇదే. దానికి అసిస్టెంట్ దర్శకుడిగా ఉంటూనే, నటుడిగానూ చేశా. ఇందులో నేను, మాదాల రంగారావు, బోసుబాబు నక్సలైట్ల పాత్రలు వేశాం. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత అట్లూరి పూర్ణచంద్రరావు లక్ష్మీ ప్రొడక్షన్స్ దర్శకుడు తాతినేని రామారావు దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా హిందీ సినిమాల్లో పనిచేశా. అలా చేస్తుండగానే జీవా పరిచయం అయ్యాడు.
ఇటీవల మీరు 'క్రాక్' సినిమాలో చేశారు కదా?
జీవా: 'క్రాక్' చిత్ర దర్శకుడు గోపిచంద్‌తో నాకు ముందు నుంచీ పరిచయం ఉంది. అమ్మిరాజు తెలుసు కదా నా మిత్రుడు. నిర్మాత. నా డేట్లు కూడా ఆయనే చూసేవాడు. అందుకే ఆయన సినిమాలో నటించా. కానీ, చిత్రానికి డబ్బింగ్ చెప్పలేకపోయా. కానీ ప్రాతకు మంచి స్పందన వచ్చింది.
ఇటీవల రేఖ భర్తగా నటించారట కదా?
జీవా: అవును చేశాను. ఆమెతో నటించాలంటే కొంత బిడియంగా ఉంది. కానీ, రేఖ చొరవ తీసుకొని చేశారు. చాలా సంతోషం.
బెనర్జీ గారు మీ తొలి చిత్రం రేప్ సీన్‌తో ప్రారంభమైందట, ఓ స్టార్ హీరోయిన్‌తో (నవ్వుతూ)?
బెనర్జీ: తాతినేని దగ్గర హిందీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నా. అప్పుడు కొంచెం మోడ్రన్‌గా ఉండేవాణ్ణి. కన్నడంలో 'చక్రవ్యూహ' అనే చిత్రానికి రీమేక్‌గా 'ఇంక్విలాబ్' పేరుతో అమితాబ్, శ్రీదేవి జంటగా సినిమా మొదలైంది. చెన్నైలో షూటింగ్. కథానాయికపై అత్యాచారయత్నం చేసే సన్నివేశం ఉంది. కన్నడలో నటించిన వ్యక్తినే ఇందులోనూ తీసుకున్నారు. ఆ సన్నివేశం తీసే సమయానికి ఆ వ్యక్తి రాలేదు. షూటింగ్ క్యాన్సల్ చేద్దామని అమితాబ్‌కి చెప్పగానే, 'అవసరం లేదు. బెనర్జీతో ఆ పాత్ర వేయించండి' అని అన్నారు. ఆ తర్వాత అమితాబ్‌తో కలిసి రెండు, మూడు సినిమాలు చేశా. శ్రీదేవితో చేసిన ఆ సన్నివేశం గురించి మా అమ్మ, మా ఆవిడ ఎక్కడా చెప్పొద్దని అంటారు(నవ్వులు).
మీ భార్యది నరసరావుపేట?
జీవా: రేపల్లె దగ్గర నల్లూరివారిపాలెం. మాది ప్రేమ వివాహం. పెద్దల అనుమతితోనే తెనాలి దగ్గర చర్చిలో పెళ్లిచేసుకొన్నాం. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు మల్టీ మీడియా చేసి, యానిమేషన్ రంగంలో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. రెండోవాడు మా దగ్గరే ఉన్నాడు. టీవీల్లో, షార్ట్ ఫిలిమ్స్‌లో పనిచేస్తున్నాడు. చిన్నవాడి పేరు బాలచందర్. పెద్దబ్బాయ్ పేరు మా అమ్మనాన్నలు పేర్లు కలిసొచ్చేటట్లు రత్న కృపాల్ చక్రవర్తి అని పెట్టాను.
దయారత్నాన్ని జీవా మార్చింది ఎవరు?
జీవా: అదీ బాలచందర్ గారే. రచయిత మహాపాత్రో నాకు చెప్పారు. బాలచందర్‌ని అడుగు, పేరు మార్చమని, నేను ఆయన్ను అడిగా. వెంటనే ఆయన ఓ తెల్ల పేపర్ గ్రీన్‌పెన్‌తో జీవా అని రాశారు. నేను సందేహిస్తుంటే. నన్ను గమనించిన మహాపాత్రో బాలచందర్‌తో "సర్ జీవా అంటే అర్థం ఏమిటి" అని అడిగారు. జీవా అంటే లైఫ్ ఆయన చెప్పారు.
చాలా కాలం క్రితం ఇండస్ట్రీని వదిలి గుంటూరు వెళ్లిపోయారు కదా? కారణం ఏమిటి.. ఎందుకు?
జీవా: నేను కెమెరా ముందే నటిస్తాను. నిజ జీవితంలో నటించడం నాకు అలవాటు లేదు. అది పిరికివాళ్లు చేసే పని. నాకు మొహమాటం ఎక్కువ. డబ్బులు అడగటం రాదు. అప్పుడే నాకు అమ్మిరాజును నటుడు శ్రీహరి పరిచయం చేశారు. అతనైతే బాగా చూస్తాడని చెప్పారు. అప్పుడప్పుడే మద్రాసు నుంచి చిత్రసీమ హైదరాబాద్‌కు వెళ్తోంది. అప్పటికే అక్కడ చిన్న గదిలో ఉంటున్నా. మళ్లీ హైదరాబాద్ అంటే? అని వెంటనే గుంటూరు వెళ్లిపోయా. అంతకు ముందు శ్రీహరి మద్రాసులో నా గదిలోనే ఉండేవాడు. శ్రీహరి మాత్రం "అన్నా మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నిరభ్యంతరంగా నా గదిలో ఉండండి" అంటూ చెప్పారు. ఇక అప్పటి నుంచి బండి గాడిలో పడింది.
బెనర్జీ: కృష్ణవంశీ 'గులాబి' సినిమా ప్రారంభించారు. రామానాయుడు స్టుడియో ఎదురుగా ఆఫీసు. అప్పటికి జీవా గుంటూరులోనే ఉన్నారు. కృష్ణవంశీ విలన్స్ గురించి మాట్లాడుతూ.. 'మన సినిమాలో అమ్మాయిలను అమ్మేసే ఓ క్రూరమైన పాత్ర ఉంది. దానికి జీవా అయితే బాగుంటాడు. అతను మంచి నటుడు' అని చెప్పారు. ఎందుకంటే జీవా లుక్ అలాగే ఉంటుంది(నవ్వులు). నిజ జీవితంలో ఆయన చాలా మంచివాడు. ఆ విషయం నాకు తెలుసు. రామాయణం, మహాభారతం, తెలుగు పాండిత్యం బాగా తెలుసు. 'గులాబి' చిత్రీకరణ సమయంలో ఓ సీనులో నేను పోలీస్ పాత్రలో ఉన్నా. జీవాని కొట్టాలి. అక్కడంతా కొత్త వాళ్లు కావడం వల్ల జీవా నటించడంలో కొంచెం భయపడుతున్నాడు. నాలుగు మూడు టేక్‌లు చేశాం. కానీ, సరిగా రావడం లేదు. కృష్ణవంశీ మాత్రం 'ఏంటిది బెనర్జీ' అని అంటున్నాడు. వెంటనే జీవాని నిజంగానే కొట్టా. దాంతో జీవా రియలైజ్ అయి ముందుకొచ్చాడు. ఒక్క క్షణం కోపాన్ని తమాయించుకున్నాడు. లేకపోతే ఆ సమయంలో నన్ను చంపేసేవాడు. ఆ సన్నివేశం బాగా పండింది. 'కేవలం సన్నివేశం కోసం మాత్రమే నిన్ను కొట్టా. అంతకు మించి లేదు' అని చెప్పా. 'మంచి పనిచేశావు బెనర్జీ' అన్నాడు. ఓ నటుడిగా నా మీద ఆయనకు ఇంకా ఇష్టం ఎక్కువైంది. 'గులాబి' తర్వాత వెనుదిగిరి చూసుకోలేదు.
హస్యనటుడిగా పేరు తెచ్చిన చిత్రమేది?
జీవా: అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా. రాత్రి తొమ్మిదిగంటల తర్వాత నిర్మాత వల్లూరిపల్లి రమేష్ నుంచి ఫోన్ వచ్చింది. మీతో వంశీగారు మాట్లాడతారట అని అన్నారు. 'మా సినిమాలో కామెడీ చెయ్యాలి' అని వంశీ అన్నారు. 'కామెడీ అంటే నాకు రాదు' సార్ అన్నా. 'నేను చేయించుకుంటా' అని చెప్పారు. ఆ సినిమా 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నేనూ ఆలీ కలిసి 'ఇడియట్'లో నటించాం. ఎలాంటి సీన్ పేపర్ లేకుండా ఆ సన్నివేశాలు సొంతంగా చేసుకుంటూ వెళ్లిపోయాం. ఆ సన్నివేశాలకు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన వచ్చింది.
అన్నా (బెనర్జీ) మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిందా?
బెనర్జీ: లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అసలు నేను పుట్టి పెరిగిందంతా దిల్లీలో. నటుడు అవుదామని మానాన్న చెన్నై వచ్చేశారు. నన్ను అక్కడ కేసరి హైస్కూల్‌లో చేర్చారు. అలా విద్యాభాస్యమంతా ఇక్కేడ జరిగింది. నా భార్య తండ్రి నాగేశ్వరరావు పెద్ద మేకప్ మెన్, నిర్మాత. చెన్నైలో మా ఇద్దరి ఇళ్లు దగ్గరగానే ఉండేవి. అలా మొదటి నుంచీ మా రెండు కుటుంబాలకు పరిచయం ఉంది. దీంతో పెళ్లికి పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. మాకొక పాప ఆమెకు గత ఏడాదిలోనే పెళ్లి చేశాం. మా నాన్న పేరు రాఘవయ్య ఆయన చాలా సినిమాలు చేశారు. 'వీరాంజనేయ' చిత్రంలో కాంతారావు రాముడు, నాన్న లక్ష్మణుడు. ఆ తర్వాత కృష్ణతో 'అసాధ్యుడు', ఏయన్నార్‌తో 'బ్రహ్మచారి'లో చేశారు. చాలా అందంగా ఉంటారు. ఎన్టీఆర్ కూడా చాలా గౌరవంగా చూసేవారు. ఎందుకంటే ఆయనకు చదువుకున్నవాళ్లంటే చాలా గౌరవం. రెండేళ్ల కిందట నాన్న, నాలుగేళ్ల క్రితం అమ్మ చనిపోయారు. "నిస్వార్థంగా మనకోసం ఉండేవాళ్లు తల్లితండ్రులే (కన్నీళ్లతో)".
జీవా: (బాధపడుతున్న బెనర్జీని ఓదారుస్తూ) అడిగినా అడక్కపోయినా ఈ ప్రపంచంలో రుణం తీర్చుకోలేని వ్యక్తలెవరైనా ఉన్నారంటే అమ్మానాన్నలే.
నిర్మాతగా ఎన్ని సినిమాలు చేశారు?
బెనర్జీ: మొదటిసారిగా 'ఇదే నా న్యాయం' తీశా. మల్లాది వెంకటకృష్ణమూర్తిగారి నవల 'ధర్మయుద్ధం' అప్పట్లో పెద్ద సంచలనం. నందకుమార్ దర్శకుడు. చిరంజీవి దగ్గరకు వెళ్లి కథ చెప్పాను. 'నందు దర్శకుడా అయితే నేను చేస్తానని' చెప్పారు. అప్పటికే చిరంజీవి చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆయన డేట్స్ సర్దుబాటు కాలేదు. ఇంకొంతకాలం ఆగుదామా అని నేను నిర్మాత పూర్ణచందర్‌రావును అడిగాను. 'అప్పటి వరకు ఆగితే ఈ నవలలోని సన్నివేశాలు ఎవరైనా కాపీ కొట్టవచ్చు. తెలుగులో వేరే వాళ్లతో చెయ్యండి. హిందీలో మరొకరిని చూద్దాం' అన్నారు. అప్పుడు నా చిన్ననాటి స్నేహితుడు అయిన భానుచందర్ దగ్గరకు వెళ్లా. అతడు కూడా బిజీ అని చెప్పాడు. అయితే, 'ధర్మయుద్ధం' నవల చేస్తున్నామని చెప్పడం వల్ల భాను చందర్ ఒప్పుకొన్నాడు. దాంతో సినిమా ప్రకటించాం.
ఎన్ని సినిమాలు తీశారు?
బెనర్జీ: ఐదు చిత్రాలు తీశా. అందులో చివరిది 'వన్స్ మోర్'. ఇందులో శ్రీకాంత్, ఆలీ, చిన్నాలు నటించారు. ఈ సినిమా షూటింగ్ తాజ్‌మహల్ వద్ద చేశాం. అప్పటి వరకు 25 ఏళ్లుగా సినిమా షూటింగ్‌లకు తాజ్‌మహల్‌లో అనుమతి లేదు. మేం తీసుకున్నాం. ఆ తర్వాత రామానాయుడు తీసిన 'తాజ్‌మహల్' చిత్రానికి నేనే మాట్లాడి అనుమతి ఇప్పించా.
మీ నటన చూసి మీ పిల్లలు మెచ్చుకునేవాళ్లా?
జీవా: (నవ్వుతూ) నేను చేసిన చిత్రాలు చూసి 'భలే చేశారు నాన్నా' అని ఎప్పుడూ అనలేదు. ఓసారి గుంటూరులో మా ఆవిడతో కలిసి 'గులాబి' చిత్రం చూసేందుకు థియేటర్ వెళ్లాం. ఓ సన్నివేశంలో అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తా. నా పక్కనే ఉండి ఆ సీన్ చూస్తున్న మా ఆవిడ కాస్త భయపడింది. 'ఇది సినిమాలే. భయపడాల్సింది ఏమీ లేదు' అని ఆమెకు చెప్పా.
ఆలీ: మీ అబ్బాయిలకు మిమ్మల్ని చూస్తే ప్రేమా, భయమా?
జీవా: నేనంటే చాలా ప్రేమ. ఇద్దరబ్బాయిల్నీ సమానంగా చూస్తా. ఇద్దరివీ ప్రేమ పెళ్లిల్లే. నా జీవితంలో కష్టాల్లోని చివరి మెట్ల వరకు చూశాను. అవంటే నాకు లెక్క లేదు. ఏం చేసినా పరిపూర్ణంగా చేయాలనేది నా సిద్ధాంతం. నటుడిని అవుతానని ఊహించ లేదు. నాటకాలు వేసే పిచ్చి మాత్రం ఉండేది. క్రిస్మస్ పండగ వస్తే నాటకాలు వేసేవాణ్ణి, వాటికి దర్శకుడిని కూడా నేనే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: "ఆచార్య', 'విరాట పర్వం' చిత్రాలకు అనుమతి ఇవొద్దు!'