చిత్రం: అమ్మోరు తల్లి
తారాగణం: నయనతార, ఆర్.జె.బాలాజీ, ఊర్వశి, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
దర్శకత్వం: ఆర్.జె.బాలాజీ, ఎన్.జె.శరవణన్
నిర్మాత: ఐసరి కె.గణేష్
విడుదల: 14/11/20 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
దేవుడు భూముల అన్యాక్రాంతం, దొంగ బాబాలు... ఈ రెండు అంశాల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. చాలావరకు విజయాలు సాధించాయి. కొన్ని బోల్తా కొట్టాయి. అయినా ఈ అంశాలు హాట్‌కేక్‌లే. ఈ రెండూ అన్ని ప్రాంతాలకు చెందిన సబ్జెక్ట్‌లు కావడం వల్ల ఏ భాషలో అయినా ఆదరణ దక్కుతుంది. దీంతో ఆర్.జె.బాలాజీ, శవరణన్ డైరక్టర్స్‌గా తొలి సినిమాకు ఆ అంశాన్నే ఎంచుకున్నారు. అదే ‘అమ్మోరు తల్లి’. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’గా తెరకెక్కిన సినిమాకు డబ్బింగ్ ఇది. సినిమాలో ప్రధాన పాత్రధారిగా నయనతారను ఎంచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రచార చిత్రాలతో అది ఇంకా పెంచారు. ఈ సినిమా ఈ రోజు (14/11/20)న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం!
కథేంటంటే:
ఏంగెల్స్ రామస్వామి (ఆర్.జె.బాలాజీ) కాశీబుగ్గ పట్టణంలో రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. అతడు వర్క్ చేసే ఉత్తరాంధ్ర టీవీకి పెద్దగా గుర్తింపు ఉండదు. అయితే స్థానికంగా ఓ స్వామి చేస్తున్న 11 వేల ఎకరాల భూ కబ్జా మీద ఆరేళ్లుగా స్టోరీ చేస్తుంటాడు. అది క్లిక్ అయితే పెద్ద టీవీ ఛానల్‌లో అవకాశం వస్తుందని ఆశిస్తుంటాడు. ఈ లోగా రామస్వామి తల్లి బంగారం (ఊర్వశి) పెళ్లి సంబంధాలు చూస్తుంటుంది. పెళ్లి కోసం నానా అబద్దాలు చెబుతుంటుంది. అవి నిజం కాదని రామస్వామి చెబుతుంటాడు. దీంతో పెళ్లి కుదరదు. మరోవైపు తిరుపతి వెళ్లాలని బంగారం చాలా రోజుల నుంచి అనుకుంటుంది. అయితే ఏదో ఆటంకం వచ్చి వీలవదు. ఈలోగా తెలిసినవాళ్లు చెప్పినట్లుగా వాళ్ల ఇంటి దైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ రామస్వామికి అమ్మవారు దర్శనమిస్తుంది. తన గుడిని తిరుపతి అంత గొప్ప దేవాలయం చేయాలని కోరుతుంది. అసలు అమ్మవారు అలా ఎందుకు అడిగింది. దానికి రామస్వామి ఏం చేశాడు. ఈ కథలో భగవతిబాబా (అజయ్‌ఘోష్) పాత్ర ఏంటి అనేదే కథ.
ఎలా ఉందంటే:
అమ్మవారి మహిమల కథలతో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో భక్తుల కోసం అమ్మవారు భూమికి దిగి వస్తుంది. ఒక్కోసారి సాధారణ వ్యక్తిలా మారి వాళ్ల కష్టాలు తీరుస్తుంది. ఇది ఓ రకం సినిమా. ఆశ్రమాల పేరుతో బాబాలు వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తుంటే హీరో వచ్చి వీరోచితంగా పోరాడి అడ్డుకుంటాడు. ఈ తరహా సినిమాలు ఆకట్టుకున్నాయి కూడా. ఈ రెండు నేపథ్యాలను కలిపి సినిమా తీస్తే... అదే ఈ ‘అమ్మోరు తల్లి’. భక్తి పేరుతో దొంగ బాబాలు మోసం చేస్తున్న విధానాన్ని, దేవుడి మాన్యాలు కాజేసిన వైనాన్ని చాలా సినిమాల్లో చూసుంటారు. ఇందులోనూ అదే చూపించారు. అయితే ఇక్కడ ఆ అరాచకాన్ని ఎలా ఆపారు అనేదే కీలక అంశం. మూసధోరణిలా కాకుండా కొంచెం కొత్తగా సినిమా నడిపించారు. దీంతో ఆసక్తిగా ఉంటుంది. దానికి వినోదం మేళవించి తెరకెక్కించడం వల్ల అభిమానులను ఆకట్టుకుంటుంది.
మధ్యతరగతి కుటుంబాలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇల్లు నడపడం, అవసరాల కోసం డబ్బులు దాచుకున్న విధానం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అమ్మవారిగా నయనతారను ఎంచుకుని బాలాజీ మంచి పని చేశాడనిపిస్తుంది. నయనతార నిండైన విగ్రహం సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ప్రేక్షకులు కూడా ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. దైవం పాత్ర అయినా కాస్త ట్రెండీగా చూపించారు దర్శకులు. అయితే ఎక్కడ ఇబ్బందికరంగా అనిపించడకుండా జాగ్రత్తపడ్డారు. ‘మీ జుట్టు ఎందుకు నల్లగా కాకుండా గోధుమ రంగులో ఉంది’ లాంటి డైలాగ్స్‌తో ప్రజల మీద పంచ్‌లు కూడా వేశారు. ఒక దేవుడి గురించి మరో దేవుడికి కోపం వచ్చిందంటూ చూపించిన రెండు సన్నివేశాలు కొంచెం ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దేవాలయాల గురించి ఉన్న కొన్ని సంభాషణలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ఇలాంటివి తప్పిస్తే ఇంకా బాగుండేది.
ఎవరెలా చేశారంటే:
అమ్మవారిగా నయనతార నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆగ్రహించిన అమ్మవారిగా దైవత్వం ఎలా చూపించిందో, వినోదాత్మక సన్నివేశాల్లో అంతే నవ్వించింది. సూపర్‌స్టార్ అని ఊరికే అనరు కదా. మధ్య తరగతి కుర్రాడిగా బాలాజీ జీవించేశాడు. కన్‌ఫ్యూజన్, కష్టం, బాధ అన్నింటినీ చక్కగా పలికించాడు. ఇక చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన పాత్ర అజయ్ ఘోష్. దొంగ బాబాగా ఆయన అదరగొట్టేశారు. తనదైన మేనరిజమ్స్‌తో నవ్వులు పూయిస్తూనే, సీరియస్ సన్నివేశాల్లో వావ్ అనిపించాడు. ఊర్వశి తదితరులు తమ పాత్ర మేరకు నటించారు. చాలా రోజులుగా కనపించని భర్త, తారసపడే సందర్భంలో ఆమె నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇక ఆమె కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అమ్మవారు కనిపించే సన్నివేశాలు, ఏరియల్ వ్యూ షాట్స్‌లో ఛాయాగ్రాహకుడు దినేష్ కృష్ణన్ పనితనం కనిపిస్తుంది. సెల్వ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. కథ, కథనం విషయంలో ఆర్.జె.బాలాజీ & టీమ్ చక్కగా వర్క్ చేసింది. దేవుడి మాన్యం భూములు, భూ ఆక్రమణలు గురించి మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్నట్లున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ చిత్రబృందం ఆకట్టుకుంది. ‘ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కాదు... ఎక్కడ జరుగుతుందనేది ముఖ్యం’ లాంటి సంభాషణలు, భక్తి గురించి అమ్మవారితో చెప్పించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
తొలిసారి దర్శకత్వం వహించినా బాలాజీ, శరవణన్ మెప్పించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్న ఈ కథను జాగ్రత్తగా సినిమాగా మరల్చారు. కె.ఎన్.విజయ్‌కుమార్ మాటలు ఆకట్టుకున్నాయి. భక్తుల మనోభావాల్ని ఆసరాగా తీసుకొని బాబాలుగా చలామణి అవుతున్న వారి ఆటకట్టించిన సినిమాలు చాలా వచ్చాయి. అందులో ఈ సినిమా కొంచెం ప్రత్యేకం. దేవుడే వచ్చి తన భూముల అన్యాక్రాంతాన్ని నిలువరించడం ఈ కథ ప్రత్యేకత. ‘దేవుణ్ని బయట ఎక్కడా వెతక్కండి. మీలోపల ఉన్నాడు. మీ లోపల ఉన్న దేవుడే మీ బెస్ట్ వెర్షన్. మీరు ఎవరనేది నిర్ణయించేది అదే’ అంటూ సినిమాను చక్కగా ముగించారు.
బలాలు
- కథా నేపథ్యం
- నయనతార, బాలాజీ
- వినోదం
బలహీనతలు
- తెలిసిన కథ కావడం
చివరిగా: ‘అమ్మోరు తల్లి’... ఒకసారి చూడొచ్చు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">