చిత్రం: ఎనిమీ
నటీనటులు: విశాల్, ఆర్య, మృణాళిని, మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్, తంబి రామయ్య, కరుణాకరణ్ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఆనంద్ శంకర్
సంగీతం: సామ్ సీఎస్, తమన్
నిర్మాత: ఎస్. వినోద్ కుమార్
విడుదల తేది: 04-11-2021
'వాడు వీడు' తర్వాత విశాల్, ఆర్య లు కలిసి నటించిన మరో చిత్రం 'ఎనిమీ'. వీరిద్దరి కలయికతో వస్తున్న చిత్రం కావడం వల్ల ఇద్దరి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. నిజమైన శత్రువు ఎవరంటే అన్నీ తెలిసిన స్నేహితుడే లాంటి మాటలు 'ఎనిమీ'పై ఆసక్తిని పెంచాయి. దీపావళి సందర్భంగా రజినీకాంత్ 'పెద్దన్న'తో పోటీపడుతూ తెలుగు, తమిళంలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా? స్నేహితులైన విశాల్, ఆర్యల్లో ఎవరికి ఎవరు శత్రువు? తెలుసుకోవాలంటే ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్దాం.
ఇదీ కథ: సూర్య(విశాల్), రాజీవ్(ఆర్య) ఊటీలో పక్కపక్కన ఇళ్లల్లో ఉంటారు. రాజీవ్ తండ్రి భరత్ కళ్యాణ్(ప్రకాశ్ రాజ్) తన కుమారుడ్ని పోలీసును చేయాలని కలలు కంటాడు. చిన్నప్పటి నుంచి శిక్షణ ఇస్తుంటాడు. రాజీవ్ శిక్షణ పట్ల సూర్య కూడా ఆకర్షితుడు కావడం వల్ల ఇద్దరికీ శిక్షణ ఇస్తుంటాడు. ఆ పరీక్షల్లో రాజీవ్ కంటే సూర్య తెలివైనవాడు అనిపించుకుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు రాజీవ్ తండ్రి హత్యకు గురవుతాడు. సూర్యను వాళ్ల నాన్న సింగపూర్ తీసుకెళ్లి పెంచుతాడు. రాజీవ్ ఏమయ్యాడో సూర్యకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత సింగపూర్ లో సూర్య ఉండే మినీ ఇండియా ప్రాంతంలో గ్యాస్ గోదాములో పేలుడు సంభవించి 11 మంది చనిపోతారు. అదే సమయంలో సింగపూర్‌కు వచ్చిన భారత విదేశాంగ శాఖ మంత్రిపై చైనా వ్యాపారులు హత్యకు కుట్ర పన్నుతారు. మంత్రిని హతమార్చేందుకు రాజీవ్‌ను సింగపూర్‌కు పంపిస్తారు. విషయం తెలుసుకున్న సూర్య ఆ కుట్రను అడ్డుకుని రాజీవ్‌ను సింగపూర్ పోలీసులకు పట్టిస్తాడు. కానీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న రాజీవ్.. తన ఆపరేషన్ విఫలం అవడానికి చిన్ననాటి స్నేహితుడు సూర్యే కారణమని తెలుసుకుంటాడు. సూర్యను కలుసుకున్న రాజీవ్ ఎలాంటి సవాల్ చేశాడు? చిన్నప్పుడు మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: సింగపూర్ లోని లిటిల్ ఇండియా అనే ప్రాంతంలో సాగే కథ ఇది. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే ఏం జరిగింది? అసలు వాళ్లిద్దరూ అలా మారడానికి కారణమేంటీ? అనేది విశాల్, ఆర్యల ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ కథకు చక్కటి యాక్షన్ హంగులు జోడించి ఆసక్తికరంగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆనంద్ శంకర్. అయితే కథను రసవత్తరంగా నడపడంలో ఆది నుంచి ఇబ్బందిపడ్డాడు. ప్రారంభంలో 20 నిమిషాలు సూర్య, రాజీవ్‌ల నేపథ్యం కోసం.. ఆ తర్వాత మరో 15 నిమిషాల సమయాన్ని విశాల్ పరిచయం కోసం కేటాయించాడు. అయితే ఆ సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా, రోటీన్‌గా సాగడం వల్ల ప్రేక్షకులకు సీరియల్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మధ్యలో ప్రకాశ్‌రాజ్ హత్య ప్రేక్షకులను ఆసక్తిరేకెత్తించినా ద్వితీయార్థం కోసం ఆ ఎపిసోడ్‌ను పక్కనపెట్టాడు దర్శకుడు. విరామ సమయానికి ముందు రాజీవ్ లిటిల్ ఇండియాలోకి అడుగుపెట్టడం, అతను చేయాల్సిన హత్యను సూర్య అడ్డుకోవడం వల్ల కథలో వేగం పెరుగుతుంది. ఇక ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డాక వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే సూర్యపై రాజీవ్ ద్వేషం పెంచుకోడానికి వెనుకున్న కారణం తెలిసిన తర్వాత ఇంత హంగామా అవసరమా అనిపిస్తుంది. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థంలో కథ గమనం వేగంగా సాగినట్లు అనిపించినా సూర్య, రాజీవ్‌ల మధ్య వచ్చే మైండ్ గేమ్ ఎపిసోడ్స్ పేలవంగా అనిపిస్తాయి. మధ్యలో రాజీవ్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే సన్నివేశాలు కథకు కాస్త ఊపు తీసుకొచ్చాయి. పతాక సన్నివేశాల్లో సూర్య, రాజీవ్‌ల మధ్య వచ్చే యాక్షన్ స్వీకెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ చివరలో సినిమాను అర్థాంతరంగా ముగించడం ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తుంది.
ఎవరెలా చేశారంటే: విశాల్, ఆర్యలు మాత్రమే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సూర్య,రాజీవ్‌ల పాత్రల్లో నూటికి నూరు శాతం న్యాయం చేసే ప్రయత్నం చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. మమతా మోహన్ దాస్, మృణాళిని రవి పాత్రలు అలంకార ప్రాయంగానే మిగిలాయి. తెరపై అలా వచ్చి పోతుంటారు తప్ప వారి పాత్రల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇక పాటలు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. కథ వేగం పుంజుకుంటుదనుకున్న సమయంలో పాటలు రావడం అడ్డంకిగా మారాయి. తమన్ పాటలు ఏ మాత్రం మెప్పించవు. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం, రాజశేఖర్ కెమెరా పనితనం ఫర్వాలేదనిపిస్తాయి. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు కాస్త కత్తెర వేస్తే బాగుండేది. అలాగే హీరోలిద్దరి మధ్య బలమైన సన్నివేశాలు లేకపోవడం సినిమాకు బలహీనతగా మారింది.
బలాలు: విశాల్, ఆర్య, కథ, దర్శకత్వం
బలహీనతలు: పాటలు, స్క్రీన్ ప్లే, కథనం
చివరగా: 'ఎనిమీ' సరిగ్గా పేలలేదు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇది చూడండి: Peddanna review: 'పెద్దన్న'గా రజనీ మెప్పించారా?