చిత్రం: అల్లుడు అదుర్స్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభానటేశ్, అను ఇమ్మాన్యుయేల్, సోనూసూద్, ప్రకాశ్ రాజ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
బ్యానర్: సుమంత్ మూవీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 14-01-2021
హిట్ అందుకోవడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. కెరీర్ ఆరంభంలోనే 'అల్లుడు శీను'తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన 'స్పీడునోడు', 'సాక్ష్యం', 'కవచం' సినిమాలతో అనుకున్న స్థాయి విజయాలను అందుకోలేకపోయారు. 'రాక్షసుడు'తో మెప్పించినా 'సీత'తో మిశ్రమ స్పందనలు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో ఆయన.. తనకు ఎంతో కలిసి వచ్చిన 'అల్లుడు' టైటిల్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 'అల్లుడు అదుర్స్' అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? ఈ ఏడాది ఆయన విజయాన్ని అందుకున్నారా?
కథేంటంటే: సాయి శ్రీనివాస్ అలియాస్ శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ఓ చలాకీ కుర్రాడు. తొమ్మిదో తరగతిలోనే వసుంధరను(అను ఇమ్మాన్యుయేల్) ఇష్టపడతాడు. అనుకోని పరిస్థితుల కారణంగా వసుంధర.. శ్రీనును వదిలి వెళ్లిపోతుంది. దీంతో శ్రీనుకు ప్రేమంటే అసహ్యం కలుగుతుంది. జీవితంలో ఎవర్నీ ప్రేమించకూడదు అనుకుంటాడు. కానీ, తొలి చూపులోనే కౌముదితో (నభానటేశ్) ప్రేమలో పడతాడు. పది రోజుల్లో కౌముదిని ప్రేమలోకి దింపుతానని ఆమె తండ్రి జైపాల్ రెడ్డితో (ప్రకాశ్‌రాజ్) ఛాలెంజ్ చేస్తాడు. మరి, శ్రీను.. కౌముది ప్రేమను గెలుచుకున్నాడా? గజ(సోనూసూద్)తో శ్రీనుకు ఉన్న వైరం ఏమిటి? శ్రీను జీవితంలోకి వసుంధర తిరిగి ఎందుకు వచ్చింది? కౌముదికి, వసుంధరకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? అనేదే కథ..!
ఎలా ఉందంటే: తెలుగు చిత్రపరిశ్రమ నుంచి దేనినైనా తప్పించగలం కానీ... రొటీన్ ఫార్ములాను మాత్రం తప్పించలేం. ఒకేలాంటి కథలు, నేపథ్యాలు తీసుకొని సినిమాలు చేస్తూ ఉంటారు అనే అపవాదు తెలుగు సినిమా పరిశ్రమ మీద ఎప్పటి నుంచో ఉంది. ‘అల్లుడు అదుర్స్’తో మరోసారి దానిని నిజం చేశారు సంతోష్ శ్రీనివాస్. తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ‘కందిరీగ’ కథను అటుఇటు మడతపెట్టి ‘అల్లుడు అదుర్స్’ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిట్ సినిమా మ్యాజిక్.. మిగిలిన సినిమాలకు వర్కౌట్ చేయాలని చూస్తే ఇబ్బందులు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే తొలి సినిమా సాధించిన విజయం, తెచ్చుకున్న క్రేజ్ అన్నిసార్లు రావాలని లేదు.
కుర్ర దర్శకులు సినిమాలంటే ఫ్రెష్‌నెస్ కోరుకుంటుంటారు మన ప్రేక్షకులు. అందులోనూ కుర్ర హీరోతో అనేసరికి ఆ అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. దీంతో ‘అల్లుడు అదుర్స్’లో ఏదో కొత్తగా చూపిస్తారని చాలామంది థియేటర్లకు వస్తారు. అలాంటప్పుడు మాటలు నుంచి ఫైట్ల వరకు, యాక్టింగ్ నుంచి ట్విస్టుల వరకు ఏవీ కొత్తగా లేకపోతే ఆ సినిమా నుంచి మ్యాజిక్ ఆశించడం కష్టమే. ఈ సినిమా విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. ఇంటర్వెల్ వరకు నాలుగు లవ్ సీన్లు, మూడు కామెడీ బిట్లతో అలా అలా సాగిపోయింది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి... మూస ధోరణికి వెళ్లి బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వినోదం కోసం సినిమాలో చాలా పాత్రలే తీసుకొచ్చాడు దర్శకుడు. కానీ, వారు కామెడీ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలుస్తుంది. వినోదం పేరుతో సినిమాలో చాలా కామెడీ ట్రాక్‌లు రాసుకున్నాడు. అయితే అవన్నీ సినిమా పాయింట్ నుంచి దూరంగానే నడుస్తుంటాయి. దీంతో కామెడీ ట్రాక్ వచ్చినప్పుడల్లా ఇది ఆ సినిమాయేనా అని అనిపిస్తుంటుంది. సెకండాఫ్‌లో తీసుకొచ్చిన హారర్ కామెడీ ట్రాక్ కూడా నవ్వులు పూయించలేకపోయాయి. మరోవైపు ఒకట్రెండు పాటలు ఫర్వాలేదనిపించినా.. సినిమా మూడ్‌ను మార్చలేకపోయాయి.
ఎవరెలా చేశారంటే: సినిమా విడుదలయ్యాక చాలా సార్లు వినిపించే మాట ‘వన్ మ్యాన్ షో’. మొత్తం హీరో మీదనే సినిమా నడించింది అంటుంటారు కదా... ఈ సినిమా కూడా అంతే. మొత్తంగా సాయి శ్రీనివాస్ మీదనే సినిమా సాగింది. యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ల విషయంలో ఎప్పటిలాగే అదరగొట్టిన శ్రీనివాస్... డైలాగ్ డిక్షన్, నటన విషయంలో కొంచెం ఇబ్బందిపడ్డాడు. కామెడీ టైమింగ్ కూడా మెరుగుపడాలి. ప్రకాశ్‌రాజ్ పాత్రలో చాలా షేడ్స్ కనిపిస్తాయి. ఇలాంటి పాత్ర ఆయనకు కొట్టినపిండి. కాబట్టి బాగానే చేసేశారు. అందాల బొమ్మలు నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేల్ అందంగా కనిపిస్తూ అలరించారు. నభా అందాలు కుర్రకారుకు నచ్చుతాయి.
ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర సోనూ సూద్. లాక్‌డౌన్‌లో రియల్ హీరో అయిపోయిన సోనూ.. ఈ సినిమా కొత్త తరహా పాత్ర చేశారు అని అందరూ అన్నారు. కానీ, ఆయన ఎప్పుడూ పోషించే సగటు విలన్ పాత్రనే ఇందులోనూ పోషించారు. తన వరకు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలు అలా వచ్చి, ఇలా వెళ్లిపోయేవే. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ లాంటి సీనియర్ కమెడియన్స్ ఉన్నా వారిని పెద్దగా వాడుకోలేదు.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు గురించే ప్రముఖంగా చెప్పాలి. సినిమా అందంగా ఉండేలా నిర్మాతలు చూసుకుంటే, దానిని అంతే అందంగా కెమెరాలో బంధించి చూపించారాయన. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఆయన స్టైల్‌లో సంగీతమందించిన మాస్ పాటలు ఆకట్టుకున్నాయి. సెట్స్ విషయయంలో ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని మెచ్చుకోవాలి. సినిమాలో చాలా చోట్ల కనిపించిన రిచ్‌నెస్ ఆయన ప్రతిభే. సినిమా తొలి భాగంలో సంతోష్ శ్రీనివాస్ రాసిన పంచ్‌లు బాగా పేలాయి. రామ్‌లక్ష్మణ్ మాస్టర్లు, స్టన్ శివ మాస్టర్ చేసిన ఫైట్స్ మాస్‌ను ఆకట్టుకుంటాయి. కానీ వైరింగ్ ఫైట్ షాట్స్ ఎక్కువైపోయాయనే భావన కూడా కలుగుతుంది.
బలాలు
-ఫస్టాఫ్‌లో వినోదం
-రిచ్ లుక్
బలహీనతలు
-తెలిసిన కథ, కథనాలు
-రొటీన్ ఫార్ములా
చివరిగా: అల్లుడు అదుర్స్.. రొటీన్ రిపీట్స్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">