చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. 'దంగల్' సినిమాను చూసినట్లు తనతో చెప్పారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల తమిళనాడు మామల్లపురంలో జిన్పింగ్తో భేటీ అయినప్పుడు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు. హరియాణా చర్ఖీ దాద్రీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని వెల్లడించారు మోదీ.
"చైనా అధ్యక్షుడిని ఇటీవలే కలిశాను. అనధికారిక సమావేశంలో పాల్గొన్నాం. చాలా విషయాలు చర్చించాం. 'దంగల్' సినిమా చూశానని చైనా అధ్యక్షుడు నాతో గర్వంగా చెప్పారు. మహిళలు ఎంత అద్భుత ప్రతిభ కనుబరుస్తున్నారో తెలిసిందన్నారు. ఆ మాటలు వినగానే హరియాణాపై గర్వంతో ఉప్పొంగిపోయా"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
దాద్రీ అసెంబ్లీ స్థానం నుంచి రెజ్లర్ బబితా ఫోగాట్ భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె జీవిత కథ ఆధారంగానే బాలీవుడ్లో దంగల్ సినిమా తెరకెక్కింది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా 2016లో విడుదలై అత్యధిక వసూళ్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని చైనాలోనూ భారీ ఎత్తున విడుదల చేశారు. డ్రాగన్ దేశంలోనూ వసూళ్ల వర్షం కురిపించింది దంగల్.
ఇదీచూడండి: 'దేశం సంతోషంగా ఉంటే.. కాంగ్రెస్కు నచ్చదు'