తల్లవ్వడం ఆడవారి ఆరోగ్యాలకు శాపం కాదని, మహిళలు తలుచుకుంటే అందాన్ని ఎప్పటికీ కాపాడుకోవచ్చని నిరూపించి... ఎందరో అమ్మలకు ఆదర్శంగా నిలుస్తున్నారు బాలీవుడ్ ఫిట్ మామ్‌లు. వారెవరో చూసేయండి...
అమ్మయినా.. అందాల శిల్పమే..

శిల్పాశెట్టి కుంద్రా... 2012లో వియాన్ రాజ్ కుంద్రాకు జన్మనిచ్చింది. తాజాగా ఈ ఏడాది ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చి రెండో సారి తల్లయింది. కానీ, శిల్పా రోజూ తనకంటూ కాస్త సమయాన్ని కేటాయిస్తుంది. ఆమె వేసే యోగాసనాలు, ఆరోగ్యకర ఆహారపు అలవాట్ల వల్లే.. తల్లయినా ఇప్పటికీ ఆమె ముఖంలో కళ, శరీరాకృతి అప్పటిలాగే ఉన్నాయి.
వయ్యారాల మామ్ మీరా..

మీరా రాజ్‌పుత్ కపూర్.. 25 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు తల్లయింది. డెలివరీ తర్వాత మారిన శరీరాకృతిని తిరిగి ఎప్పటిలా మార్చేందుకు.. రోజూ భర్త షాహిద్ కపూర్‌తో కలిసి జిమ్‌లో వ్యాయామం చేసింది. కొద్దిరోజుల్లోనే మళ్లీ వయ్యారంగా మారిపోయింది.
అరోరా ఎప్పటికీ ఫిట్టేరోయ్!

మలైకా అరోరా అందరిలా ఆహార ప్రియురాలు. కానీ, రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎప్పుడూ శరీరాకృతి మాత్రం మారలేదు. తల్లయిన సమయంలో విపరీతంగా లావైపోయింది. కానీ, డెలివరీ తర్వాత యోగా సెషన్లకు కచ్చితంగా హాజరై తిరిగి ఫిట్‌గా మారిపోయింది.
సైజ్‌జీరో మామ్!

ఒకప్పుడు బొద్దుగా ఉన్న కరీనా కపూర్.. సైజ్‌జీరో శరీరాకృతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఆపై.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుని.. తైమూర్ అలీఖాన్‌కు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత భారీగా బరువు పెరిగిపోయిన కరీనా.. ఊహించని విధంగా తన వ్యాయామం, సంకల్పంతో మళ్లీ తనదైన జీరోసైజ్ ఫిజిక్ సొంతం చేసుకుంది.
ఫిట్నెస్ కా కరిష్మా

కరీష్మా కపూర్.. తన నటనతో బాలీవుడ్లో రికార్డులు సృష్టించింది. పెళ్లయినా, తల్లయినా ఎప్పటికీ అదే శరీరాకృతితో కనిపిస్తోంది.
సర్ఫింగ్ బ్యూటీ...

లీసా హేడెన్‌కు సర్ఫింగ్ అంటే మహా ఇష్టం. ఓ బిడ్డకు అమ్మ అయినప్పటికీ సముద్రంలో సర్ఫింగ్ చేసి.. ఫిట్‌గా ఉన్నానంటోంది.
విశ్వం మెచ్చిన తల్లి..

సుస్మితా సేన్ అందం, ఆత్మవిశ్వాసంతో విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇద్దరు కుమార్తె (దత్తత ద్వారా)లకు తల్లయినా.. తన ఆరోగ్యకరమైన జీవనశైలితో చెక్కు చెదరని అందంతో మెరిసిపోతోంది.
ఇదీ చదవండి:ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ అందాలు అదరహో