'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించిన 'జాంబీ రెడ్డి' హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. సినిమా కోసం వచ్చిన ఆలోచన దగ్గరి నుంచి విడుదలకు సిద్ధమవడం వరకు జరిగిన పరిణామాల్ని చెప్పారు.
'జాంబీ రెడ్డి'లో హీరోగానే కాకుండా రెండో, మూడో కథానాయకుడిగా చేయమన్నా సరే నటించేవాడినని తేజ అన్నారు. జాంబీలకు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ జోడించడం వల్ల జనాలకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.

జాంబీలు ఒకవేళ కడప వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆలోచన దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తనకు వచ్చిందని ప్రశాంత్ వర్మ చెప్పారు. తమ కథలో ఓ వైరస్ ఉందని, కరోనా వచ్చిన తర్వాత జనాలకు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టామని అన్నారు. తొలుత సీరియస్‌గానే తీద్దామనుకున్నామని, లాక్డౌన్ తర్వాత తమ ఆలోచన మారి, వీలైనంత హాస్యం జోడించామని ప్రశాంత్ తెలిపారు.
షూటింగ్ సమయంలో చిత్రబృందానికి బెదిరింపు ఫోన్లు వచ్చాయని, టైటిల్ విషయమై అసభ్య పదజాలంతో తమను తిట్టారని ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే సినిమా విడుదలైన తర్వాత వాళ్ల ఆలోచన కచ్చితంగా మారుతుందని అన్నారు.

'జాంబీ రెడ్డి' విషయంలో చిరంజీవి తమకు బెస్ట్ విషెస్ చెప్పారని తేజ వెల్లడించారు. విడుదలైన తర్వాత కచ్చితంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న మార్నింగ్ షో తర్వాత అభిమానులు సూపర్ హిట్ అని చెప్పడమే తనకు మర్చిపోలేని సంఘటన అవుతుందని తేజ అన్నారు. హీరోయిన్లతో కాకుండా జాంబీలతో రొమాన్స్, ఫైటింగ్, ఛేజింగ్‌లు లాంటివి కూడా ఇందులో ఉంటాయని తెలిపారు.
ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. తానే ఓ ప్రేక్షకుడిలా ఆలోచించి పూర్తి కథ సిద్ధం చేశానని అన్నారు. అలానే ఇంటర్వెల్ సీన్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చాలా భయపడ్డానని తెలిపారు. ప్రేక్షకుడు కూడా ఆ సీన్ వచ్చినప్పుడు కచ్చితంగా భయపడతారని ధీమా వ్యక్తం చేశారు.

ఇతర భాషల్లోని జాంబీ సినిమాల ఛాయలు ఇందులో కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డామని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. వీలైనంత వరకు కొత్తగా రూపొందించామని తెలిపారు. ఈ చిత్రానికి సీక్వెల్స్ కూడా ఉంటాయని అన్నారు.
తన తర్వాతి సినిమా 'ఇష్క్'.. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో చేయడం ఆనందంగా ఉందని తేజ తెలిపారు. రీఎంట్రీలో నిర్మాత ఆర్.బి.చౌదరి మూడు సినిమాలు చేస్తుంటే అందులో తనది ఒకటి కావడం విశేషమని అన్నారు. మిగతా రెండింటిలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారని తేజ చెప్పారు.
ఇది చూడండి: లైవ్ : 'జాంబీ రెడ్డి' చిత్ర బృందంతో చిట్ చాట్