"నేనిప్పటి వరకు కథా బలమున్న ప్రయోగాత్మక కథలే చేశా. కానీ, 'జాంబిరెడ్డి' చిత్రాన్ని మాస్ థియేటర్లో చూస్తుంటే.. ఇన్ని రోజులు నేనేం కోల్పోయానో అర్థమైంది. మాస్ ప్రేక్షకుల అరుపులు.. నవ్వులు.. నాకెంతో నచ్చాయి" అన్నారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడాయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జాంబిరెడ్డి'. తేజ సజ్జా కథానాయకుడిగా నటించారు. రాజ్ శేఖర్ వర్మ నిర్మించారు. ఆనంది, దక్ష నగార్కర్ కథానాయికలు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో తేజతో పాటు చిత్రబృందంలోని పలువురు మాట్లాడారు.
"అందరికీ నచ్చితే సినిమాను ఏస్థాయిలో కూర్చోబెడతారో మాకీ చిత్రంతో ప్రేక్షకులు చూపించారు. ఈ విజయం నాలో భయంతో పాటు బాధ్యతను పెంచింది."
- తేజా సజ్జా, కథానాయకుడు
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. "జాంబి జానర్‌ను కుటుంబ ప్రేక్షకులకూ చేరువ చేయాలనే ఉద్దేశంతోనే.. దీన్ని ఆద్యంతం వినోదాత్మకంగా తీర్చిదిద్దాం. మార్క్ కె.రాబిన్ తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. బాషా మేకప్‌తో.. నాగేంద్ర తన ఆర్ట్ వర్క్‌తో సినిమాకు ప్రాణం పోశారు" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు హేమంత్, గెటప్ శ్రీను పాల్గొన్నారు. \
ఇదీ చూడండి: 'ఉప్పెన' మరో 'రంగస్థలం' అవుతుంది!: చిరు