మహిళల మనసుల్ని ఎంతో అర్థం చేసుకుంటే తప్ప... వాళ్లపై ఎంతో ప్రేమ... గౌరవం ఉంటే తప్ప ఇలాంటి సంభాషణలు రాయలేరు. దర్శకుడు కిషోర్ తిరుమల 'నేను శైలజ' చిత్రం కోసం రాసిన మాటలు ఇవి. ఆయన ప్రతి సినిమాలోనూ మహిళల పాత్రలు... వాళ్లని ఉద్దేశించిన మాటలు హృదయాలకి హత్తుకునేలా ఉంటాయి. ఇప్పుడాయన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అంటూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా కిషోర్ తిరుమలతో చెప్పిన విషయాలివీ...
"మన జీవితాల్లో ఉన్న మహిళల గురించి కొంచెం ఆలోచించి, కొంచెం తెలుసుకున్నా సరే..జోహార్లు చెప్పాలి అనిపిస్తుంది. ఇక పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశామంటే వాళ్లు మనకు వేరే రూపంలో కనిపిస్తారు. నా దృష్టిలో ఓ శక్తి స్వరూపిణి మహిళ. భగవంతుడిని చూసినా వాళ్లలో సగం అమ్మవార్లు, ఆడవాళ్లే కదా! వేంకటేశ్వర స్వామి గుండెల్లోనూ, శివుడి తలపైన, సగ భాగంలోనూ ఆడవాళ్లే కదా ఉంటారు. వాళ్లే మనకు అన్నీ అని గుర్తించాలి, జోహార్లు చెప్పాలి. ఆడవాళ్లు లేకుండా ఈ సృష్టి లేదు, మనం లేము. మనకు జన్మనిచ్చిన దగ్గర్నుంచి మన జీవితం మొత్తం అమ్మగా, చెల్లిగా, పెళ్లయ్యాక భార్యగా, ఆ తర్వాత మన కూతురిగా... ఇలా మన జీవితం మొత్తం నడిపించేది వాళ్లే. జన్మనివ్వడం మించిన విషయం ఏముంటుంది? ఒక యుద్ధాన్ని జయించినట్టే కదా. పెళ్లి తర్వాత అమ్మానాన్న, అన్నదమ్ములు, స్నేహితులు, ఊరు, వీధి అన్నీ వదిలి అర క్షణంలో బయటకి వెళ్లిపోవాలంటే ఎంత ధైర్యం కావాలి? ఇలా ఒకటని కాదు...వాళ్ల ఓపికకీ, సహనానికీ జోహార్లు చెప్పాల్సిందే".
"మహిళ లేకపోతే మనం లేమనే భావన నాలో బలంగా నాటుకుపోయింది. నా రచనలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంటుంది. అంతే తప్ప ఆ పాత్రల కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను. అమ్మ గురించి చెప్పాలన్నా, తండ్రీ కూతురు బంధం గురించి చెప్పాలన్నా, ప్రేమించే అమ్మాయి గురించి రాసే మాటలైనా... వాటిలో మహిళలపై నాకున్న గౌరవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో అది మరింత పరిపూర్ణంగా కనిపిస్తుంది. నా జీవితంపై బలమైన ప్రభావం చూపించిన మహిళ మా అమ్మ ఆదిలక్ష్మి. ఆడవాళ్లు మన ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని సర్దుకుంటారు కానీ, ప్రేమలో సర్దుకోలేరు. మనది మధ్య తరగతి కుటుంబమే అనుకోండి. అవసరం కోసం భార్య నగల్ని తాకట్టు పెట్టాక తీసుకురావడంలో ఆలస్యమైనా కోప్పడరు. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అదే పది రూపాయాలు పెట్టి మల్లెపూలు తీసుకురాలేదంటే మాత్రం అలుగుతారు, బాధపడతారు. మన నుంచి అందే చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువ ప్రేమని పొందుతారు. మన నుంచి వాళ్లు ఎక్కువగా ఆశించేది ప్రేమనే".
"ప్రతి లక్షణాన్నీ గుర్తు చేసుకుని, మన జీవితంలో ఉన్న ఆడవాళ్లకి జోహార్లు చెప్పే సందర్భాలు ప్రతి ఒక్కరికీ వాళ్ల జీవితంలో ఎన్నోసార్లు వస్తాయి. మన ఇంట్లో ఆడవాళ్లనీ, మనకు తెలిసిన ఆడవాళ్లని గుర్తు చేసుకునేలా మా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఉంటుంది. వినోదం భావోద్వేగాలు, డ్రామా... ఇలా అన్ని అంశాల మేళవింపుగా ఆ చిత్రం రాబోతోంది. మా అక్క ఇలాగే, మా ఆవిడ ఇలాగే, మాకు తెలిసినవాళ్లు ఇలాగే ఉన్నారనుకునేలా సినిమాలోని పాత్రలు ఉంటాయి. హీరో చుట్టూ ఉన్న మహిళల పాత్రలు కానీ, హీరోయిన్ జీవితంలో మహిళలు కానీ మన జీవితాన్ని గుర్తు చేస్తుంటారు. సినిమాలో అలకలు, చాదస్తాలు అన్నీ ఉంటాయి. పిల్లాడిని కొట్టబోతుంటే, ఆడు పిల్లాడండీ అంటారు. మగాళ్లపై కోపం వస్తే అదే పిల్లల్ని వాళ్లు కొట్టబోతుంటారు. ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి. మహిళల కోసమే అన్నట్టుగా ఉంటుంది సినిమా. వాళ్లని వాళ్లు గుర్తించుకుంటూ... మగవాళ్ల తరఫున గుర్తు చేసుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం".
ఇదీ చూడండి: హీరోహీరోయిన్లకు రెమ్యునరేషన్లో ఎందుకీ వ్యత్యాసం?